ఏపీలో మూాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు ఓట్లు వేయబోతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, వైసీపీలు అభ్యర్థుల్ని నిలబెట్టాయి. జనసేన పార్టీ నిలబెట్టలేదు. మరో పది రోజుల తర్వాత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మద్దతు ఎవరికన్నది స్పష్టత లేకుండా పోయింది. వైసీపీకి మాత్రం వేయవద్దు.. మీ ఇష్టం వచ్చినవారికి వేయండి అని పార్టీ సానుభూతిపరులకు నాదెండ్ల మనోహర్ సందేశం పంపారు. ఇదే పవన్ కల్యాణ్ సందేశం అని చెబుతున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ ఇప్పటికీ తాను బీజేపీతో పొత్తులోనే ఉన్నానని చెబుతున్నారు. బీజేపీ కూడా అదే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలు చేస్తూంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు అడగడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈగోకు పోయినట్లుగా కనిపిస్తోంది. పవన్ మద్దతు అడగకపోవడంతో.. అడగకుండా మద్దతు ఇవ్వడం ఎందుకని పవన్ కల్యాణ్ కూడా సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు.
బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలు జరిగినప్పుడు జనసేన పార్టీ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటించినా బరిలో నిలిచిన బీజేపీ.. జనసేన పేరును విస్తృతంగా ఉపయోగించుకున్నారు. పవన్ కల్యాణ్ బొమ్మ చూపి ఓట్లేయాలని అడిగారు. ఇప్పుడు పవన్ .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. మరి తమకు మద్దతు ఇవ్వాలని అడగడానికి బీజేపీ నేతలకు నోరు రావడంలేదు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి యువత నుంచి కూడా మద్దతు ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. పవన్ మద్దతిస్తే ప్లస్ అయ్యేది. కానీ ఆయన మద్దతు కోసం బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.