బీజేపీతో సరిగ్గా కలిసి పని చేయలేకపోతున్నామని .. అందుకే వ్యూహం మార్చుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించిన తరవాత బీజేపీలో అలజడి ప్రారంభమయింది. పలువురు నేతలు ఈ అంశాన్ని బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అందుకే వెంటనే బిజేపీ పెద్దలు పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారని.. ఢిల్లీకి వస్తే మాట్లాడుకుందామని పిలిచారని చెప్పుకున్నారు. ప్రత్యేక విమానం కూడా పంపినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అంతా అబద్దమే. పవన్ కల్యాణ్‌ను బీజేపీ పెద్దలు పిలువలేదు.
విశాఖలో జరిగిన ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ రాజ్ భవన్ నుంచి పవన్‌కు అపాయింట్మెంట్ విషయంలో ఎలాంటి స్పందన రాలేదు. చివరికి బీజేపీ నేతలు .. గవర్నర్ అపాయింట్ మెంట్ విషయంలోనూ సహకరించలేకపోయారు. ఇటీవల జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన సమయంలో కూడా పవన్ ను కలిసేందుకు ఆసక్తి చూపలేదు. అమిత్ షా , నడ్డాలు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో ఇతర హీరోలను పిలిచారు కానీ పొత్తులో ఉన్న నేతను పిలిచి మాట్లాడలేదు.
చివరికి తాను బీజేపీతో కటీఫ్ చెప్పబోతున్నట్లుగా సంకేతాలు వచ్చినా బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు. రాష్ట్ర నేతలు మాత్రం జనసేనతో పొత్తు ఉంటుందంటున్నారు కానీ.. ఎవరూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. సోము వీర్రాజు వ్యవహారంలో పవన్ మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన మాట్లాడితే పరిస్థితులు దిగజారుతాయి కానీ.. మెరుగుపడవు. హైకమాండ్ కూడా ఎందుకు లైట్ తీసుకుంటుందో బీజేపీ నేతలకూ అర్థం కావడం లేదు.