తెలంగాణలో రైతు బంధు పథకాన్ని ఆపాలంటూ కాంగ్రెస్ ఈసీకి లేఖ ఇచ్చిదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై ధర్నాలు చేయాలని పార్టీ క్యాడర్‌కు కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. అయితే… ఎవరు అడ్డుకున్నా రైతు బంధు ఆగదని.. సమయానికి రైతుల ఖాతాల్లో వేస్తామని ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరంగా మారంది. ఎన్నికల నామినేషన్ల లోపు పథకాల డబ్బులన్నీ లబ్దిదారుల ఖాతాల్లో వేయాలని రేవంత్ రెడ్డి ఈసీని కోరారు. ఆపమని చెప్పలేదు.
2018లో సరిగ్గా ఓటింగ్ సమయంలో చెక్కులు రైతుల చేతికి అందాయి. అప్పట్లో బీఆర్ఎస్ గెలుపులో ఈ చెక్కులు కీలక పాత్ప పోషించారు. అయితే ఆ తర్వాత చెక్కుల పద్దతిని తొలగించి నేరుగా ఖాతాల్లో వేస్తున్నారు. అదీ కూడా ఒకే సారి వేయడం లేదు. రెండు, మూడు వారాల పాటు వేస్తూ వస్తున్నారు. దీనికి కారణం ఆర్థిక సమస్యలే. ఇప్పుడు రైతు బంధు జమ చేయాలంటే ఆరేడు వేల కోట్లు కావాలి. గతంలో డిసెంబర్లో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాము కాంగ్రెస్ అడ్డుకున్నా రైతు బంధు జమ చేస్తామని చెప్పకపోవడమే కాంగ్రెస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
ఇలాంటి రాజకీయాలు గతంలో కేసీఆర్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో వరద బాధితులకు కొంత సాయం చేసి.. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మొత్తం ఆపేసి.. విపక్షాల వల్లనే ఆపేశామని విమర్శలు గుప్పించారు. దళిత బంధు విషయంలోనూ అంతే. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రకటించి కోడ్ రాగానే ఆపేశారు. ఇప్పటి వరకూ మళ్లీ రెండు, మూడు వందల మందికి కూడా ఇవ్వలేదు. ప్రతీ సారి ఇదే తంతు. రైతు బంధు, దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ నేతల రియాక్షన్ చూస్తూంటే… పథకానికి డబ్బులు ఇచ్చే ఉద్దేశంలో లేరన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా… డబ్బులు జమ చేయకపోతే బీఆర్ఎస్కు మైనస్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.