వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలపై గురి పెట్టారు. టిక్కెట్లు రాని నియోజకవర్గ స్థాయి నేతలకు.. ఓ విలువ కట్టి మరీ కండువాలు కప్పేస్తున్నారు. ఈ చేరికల కోసం.. ఆయన ఓ రోజు ప్రచారాన్ని నిలిపి వేసి.. లోటస్పాండ్లో … కండువాలతో కూర్చున్నారు కూడా. అలా చేరుతున్న వాళ్లంతా.. మెజార్టీ తెలుగుదేశం పార్టీ నేతలే. కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. అంతో.. ఇంతో ఉన్న.. బీజేపీ నేతల జోలికి ఆయన ఎందుకు వెళ్లడం లేదు..? జగన్మోహన్ రెడ్డి వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు..?.
భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏపీలో ఎలా ఉందో .. అందరికీ తెలుసు. అయితే.. ఆ పార్టీకి కొంత మంది నేతలు ఉన్నారు. టీడీపీతో పొత్తు ఉన్న కారణంగా గత ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరారు. రాజకీయ భవిష్యత్ కోసం.. ఆ పార్టీలో చేరిన వారు.. ముందు నుంచీ ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది.. ఇప్పటి బీజేపీ పరిస్థితిని చూసి… ఏ పార్టీలోకి వెళ్దామా అని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో.. తమకు చాలా అవకాశాలు వస్తాయని… ఎంతో కొంత వర్కవుట్ అవుతుందని ఆశ పడ్డారు. ఎలాగూ.. టీడీపీ వారి వైపు చూడదు. కానీ.. చేరికలతో ప్రభంజనం సృష్టించాలనుకుంటున్న వైసీపీ ఎందుకు చూడటం లేదనే ప్రశ్న వారిని వేధిస్తోంది.
నిజానికి కావూరి సాంబశిరావును పార్టీలోకి తీసుకుని ఏలూరు టిక్కెట్ ఇవ్వాలని జగన్ చాలా ఆశ పడ్డారు. కానీ బీజేపీ హైకమాండ్ పడనీయలేదని ప్రచారం జరుగుతోంది. కావూరి దగ్గర్నుంచి చాలా మంది బీజేపీ నేతలు… అవకాశం ఇచ్చినా.. లేకపోయిన తర్వాత అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినా.. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అంత ఎందుకు.. ఏకంగా కన్నా లక్ష్మినారాయణే ఆ పార్టీలో చేరడానికి సిద్ధం అయ్యారు. చివరి క్షణంలో ఆగిపోయారు. అలాంటి పరిస్థితి ఉంది. చేరడానికి ఎవరు ఆసక్తి చూపినా వైసీపీ నేతలు మాత్రం.. ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. తమ పార్టీ నేతల్ని చేర్చుకుంటే… అమిత్ షా ఆగ్రహిస్తారేమోనని కోపం కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.