అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరిగినా … తెలంగాణ విపక్షాల నుంచి ఓ విమర్శ కామన్‌గా వస్తుంది. అదే కేసీఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించకపోవడం. ఈ సారి కూడా కేసీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎక్కడా పాల్గొన్నట్లుగా సమాచారం బయటకు రాలేదు. ఫోటోలు కూడా విడుదల చేయలేదు. దీంతో ఇతర పార్టీల నేతలకు మరోసారి చాన్స్ దొరికినట్లయింది. కేసీఆర్‌కు అంబేద్కర్ అంటే గౌరవం లేదని అందుకే రాజ్యాంగాన్ని మార్చేయాలని అంటున్నారని.. . కనీసం నివాళులు కూడా అర్పించరని విమర్శలు ప్రారంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు. అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏడేళ్లలో ఒక్కసారి కూడా నివాళులు అర్పించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇలా నివాళులు అర్పించిన సందర్భాలు దాదాపుగా లేవు. అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని ఇతర పార్టీలు విమర్శిస్తున్నా ఆయన వైఖరిలో మార్పు లేదు.
ఒక్క అంబేద్కర్ మాత్రమే కాదు జయశంకర్ సార్ వంటి వారి జయంతులకు కూడా నివాళులు అర్పించడానికి కేసీఆర్ ఆసక్తి చూపరు. దీని వల్ల విమర్శలు ఎదురైనా ఆయన తన దారిలోను తాను నడుస్తారు. అలాగని ఆయనకు అంబేద్కర్‌పై గౌరవం లేకపోవడం కారణం కాదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై గౌరవం ఉంది అంబేద్కర్ స్మృతి వనాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నామని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.