భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వైఖరిలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆయన మోదీపై యుద్ధం చేయడం ఆపేసినట్లుగా కనిపిస్తోంది. ఆయనపై విమర్శలు చేయడం లేదు. తాజాగా మహారాష్ట్ర నుంచి కొంత మంది రాజకీయ నేతలు వచ్చి బీఆర్ఎస్లో చేరే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చారు. మామూలుగానే తెలంగాణ భవన్లో జరుగుతున్న కార్యక్రమాలకు మీడియాను అనుమతించడం లేదు. ఓ మీడియా ఏజెన్సీ ద్వారా లైవ్ ఇస్తూంటారు.
ఆ ఒక్క కెమెరామెన్ మాత్రమే లోపల ఉంటారు. ఇలా ప్రసంగం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా కేసీఆర్ .. ఆ కెమెరామెన్‌ను లైవ్ ఆపేసి వెళ్లిపొమ్మని చెప్పారు. ఇంత వరకూ రికార్డు అయింది. మీడియాలో లైవ్ వచ్చింది. కానీ తర్వాత ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. అప్పటి వరకూ కేసీఆర్ కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. తన జీవితం అంతా పోరాటాలేననని తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. చిత్తశుద్ధితో పని చేస్తే గెలిచి తీరుతామని మహారాష్ట్ర నేతలకు సలహాలు ఇచ్చారు.
13 నెలల పాటు దేశ రాజధానిలో రైతులు పోరాడారు అని కేసీఆర్ గుర్తు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులన్నారు.. ఖలీస్తానీలన్నారు.. వేర్పాటువాదులన్నారు. రైతుల పోరాటంతో మోదీ దిగివచ్చి క్షమాపణ చెప్పారు. 750 మంది రైతులు చనిపోతే ప్రధాని కనీసం స్పందించలేదు. మన దేశంలో దేనికి కొదవ లేదు. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే మోదీని మాత్రం ఎక్కడా విమర్శించలేదు. మోదీని విమర్శించే సమయానికి లైవ్ ఆపేయమని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
తాజా పరిణామాలతో నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు చేయడానికి కేసీఆర్ వెనుకాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల జోలికి వెళ్లకపోవడం.. మహారాష్ట్ర నుంచి చోటా నేతల్ని పిలిపించుకుని చేర్పించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూండటంతో నిజమేనన్నగుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.