ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చాలాసార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడితో ఆగకుండా.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ కలిశారు. ఆ తరువాత, అమరావతిలో జగన్ తో కేసీఆర్ మీటింగ్ ఉంటుందనుకున్నారు… కానీ జరగలేదు! కోడి కొత్తి కేసు మొదలుకొని, డాటా చోరీ వివాదం వరకూ ఆంధ్రా పోలీసులను నమ్మేది లేదని జగన్ అనడమూ, తదనుగుణంగానే తెలంగాణ కేంద్రంగానే కేసుల నమోదు జరగడం… ఈ క్రమంలో ఆంధ్రా రాజకీయాల్లో కేసీఆర్ గట్టిగా వేలు పెట్టే ప్రయత్నమే చేస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ అభిప్రాయానికి కాస్త దూరం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు తెరాస నేతలు!
సంక్రాంతి పండుగ తరువాతి నుంచి నిన్నమొన్నటి వరకూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటమే పనిగా పెట్టుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్… ఇప్పుడు సైలెంట్ అయిపోయారు! ఆంధ్రాలో బీసీలను కలిపేస్తా, నాయకత్వం వహించేస్తా అంటూ హడావుడి చేసిన ఆయన ఇప్పుడు మాట్లాడటం లేదు. జగన్ ఫ్యాన్ తిరగాలంటే, కేసీఆర్ స్విచ్ ఆన్ చెయ్యాలని, ఢిల్లీ నుంచి మోడీ కరెంటు సప్లై ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శిస్తున్నా…. ఏపీలో వైకాపా అభ్యర్థులు గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నా… తెరాస నేతలు స్పందించడం లేదు! తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ కూడా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. మామూలుగా అయితే ఈపాటికే కేసీఆర్ ఈ విమర్శలపై తీవ్రంగా స్పందిచాల్సి ఉంది! కానీ, ఎందుకు ఆ ఊసెత్తడం లేదనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.
ఆంధ్రా రాజకీయాల్లో వేలు.. అంటే, టీడీపీని గెలవనీయకుండా చేయడమే కదా కేసీఆర్ లక్ష్యం. అంటే, జగన్ గెలవాలన్నది ఆయన వ్యూహం. దాన్లో భాగంగానే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననీ, ఆంధ్రాలో బీసీ గర్జన సభలు పెడతామనీ, డాటా చోరీ కేసు అనీ… ఇవన్నీ తెరమీదికి వచ్చాయి. అయితే, ఏ ప్రయోజనం ఆశించి కేసీఆర్ ఈ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చారో… అది నెరవేరకపోగా, అదే ఇప్పుడు వైకాపాకి రాజకీయంగా నష్టం కలిగించే అంశంగా ఏపీలో మారుతోందన్నది వాస్తవం. ఇది గ్రహించారు కాబట్టే… ఏపీ రాజకీయాలపై కేసీఆర్ మౌనం దాల్చారనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రచారానికి కొద్దిరోజులే సమయం ఉంది. ఈలోగానైనా ఏపీ రాజకీయాల గురించీ, తనపై వస్తున్న విమర్శల గురించీ కేసీఆర్ మాట్లాడే పరిస్థితి ఉంటుందో లేదో చూడాలి.