అధికారంలో ఉన్న వారికి బాధ్యతలుంటాయి. జాగ్రత్తలుంటాయి. అవి లేకపోతే విచ్చలవిడి తనం వచ్చేస్తుంది. ఏపీలో అదే జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతోంది. ప్రతిపక్షాలు విమర్శిస్తే.. కొడతాం అని చెప్పి మరీ కొడుతున్నారు. పోలీసులు అంతా అయిపోయాక వస్తున్నారు. రాజకీయాల్లో ఈ అసహనం.. ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఇదే కొనసాగితే.. తర్వాత రాజకీయ హత్యలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అది ప్రజాస్వామ్య హననానికి దారి తీస్తుంది.
అధికారం ఉందని కొడతారా? చంపుతారా ?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇల్లు.. హైదరాబాద్‌లో హై సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. వంద మంది టీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడి విధ్వంసం చేసారు. పోలీసులు తర్వాత వచ్చారు. వెంటనే కవిత ప్రెస్ మీట్ పెట్టి… అర్వింద్‌ను మెత్తగా తంతాం.. కొడతాం.. చంపుతాం.. అని హెచ్చరించారు. దీంతో ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారని ఎవరికైనా అర్థమైపోతుంది. అర్వింద్, కవిత రాజకీయ ప్రత్యర్థులు, ఒకరినొకరు విమర్శించుకోవడం చాలా కాలంగా ఉంది. ఇప్పుడే దాడులు ప్రారంభమయ్యాయి. చంపుతామని కూడా హెచ్చరించారు. ఇది దేనికి సంకేతం ?
ఏపీలో అయితే ఎప్పట్నుంచో అరాచకమే !
ఏపీలో ఎప్పట్నుంచో ఈ అరాచకం నడుస్తోంది. డీజీపీ ఆఫీసు పక్కనే ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పట్టాభిరాం ఇంటిపై రెండు సార్లు దాడులు చేశారు. ఇలా చాలా మంది టీడీపీ నేతలపై దాడులు జరిగాయి.కానీ పోలీసులు కేసులు కూడా పెట్టనంత దారుణమైన లా అండ్ ఆర్డర్ అక్కడ ఉంది. మా పార్టీ వాళ్లకు బీపీ వచ్చిందని స్వయంగా సీఎం జగన్ సమర్థించుకున్న తర్వాత పోలీసులేం చేయగలరు ? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో విచక్షణ కోల్పోయి విపక్ష నేతలను కొట్టడం.. ఇళ్లపై దాడులు చేయడం తప్పు లేదనుకునే స్థితికి అసహనం వెళ్లిపోయింది.
విమర్శలు చేస్తే భరించలేకపోతున్న అధికార పార్టీలు !
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. తాము విమర్శలపేరుతో బూతులు తిట్టొచ్చు కానీ విపక్షాలు విమర్శిస్తే మాత్రం ఊరుకోమన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తమది అధికారం కాబట్టి .. తాము ఎన్నైనా అంటాము.. తమను అంటే మాత్రం కొడతామని మీదకు వచ్చేస్తున్నారు. ధర్మపురి అర్వింద్ విషయంలో జరిగింది అదే.
ప్రజల భయం పార్టీలకు లేదా ?
అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు శిక్షిస్తారని గతంలో అధికార పార్టీలు జాగ్రత్తగా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పుకుంటారని అనుకోవడం లేదు. అధికారం మారిదే తమపైనా అదే స్థాయిలో దాడులు జరుగుతాయన్న ఆందోళనా ఉండటం లేదు. రాజకీయ పార్టీలు అక్కడి వరకూ ఆలోచించడం లేదు. ఇప్పుడు దాడులు చేసి విపక్షాల్ని భయపెడతాం.. అన్నదగ్గరే ఆలోచిస్తున్నాయి. ఇది రాజకీయ అరాచకానికి కారణం అవనుంది.