గత రెండు వారలుగా తెలుగు న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు. ఒకటే న్యూసు. డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్. ఈ విషయంలో మీడియా ఆరాటం చూస్తుంటే అసలు ఏమనాలో అర్ధం కావడం లేదు. దేశంలో, రాష్ట్రంలో మరేతర సమస్య లేనట్లు.. ఒకటే డ్రగ్స్ మోత. దీనికి కారణం లేకపోలేదు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వుండటమే మీడియాను ఎట్రాక్ట్ చేసిన పాయింట్. అసలు ఇది ఎలాంటి కేసు అనే చెప్పే నైతిక భాద్యత లేకుండా.. దొరికిందే తడువుగా మోత మోగిస్తున్నాయి మీడియా ఛానళ్ళు.
” డ్రగ్స్ రాకెట్ లో ఒక ముఠా దొరికింది. ఆ ముఠా నుండి డ్రగ్స్ వాడినట్లు కొందరిని గుర్తుంచారు. వారిని విచారించి ఆధారాలు సేకరిస్తే.. ఆ ముఠాపై కేసు ఇంకా బలంగా ఉటుంది. ప్రస్తుతం విచారణ ఎదుర్కుంటున్న ప్రముఖులు సాక్ష్యులు మాత్రమే. వీరిలో కొంత మంది డ్రగ్స్ ముఠాతో నేరుగా సంబధాలు పెట్టుకున్నారు అని తేలితే చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు” ఇదీ గత రెండు వారాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విచారణ జరుపుతున్న ఈ డ్రగ్స్ కేసు అసలు సంగతి. కాని దీన్ని మీడియా దారునాతి దారుణంగా ప్రోజెక్ట్ చేసింది. ఓ నలుగురు సినిమా ప్రముఖులు వున్నారని తెలిసి రెచ్చిపోయింది. అసలు ఈ డ్రగ్స్ రాకెట్ భారతదేశంలో మొదటిసారి వెలుగు చూసినట్లు తెగ ఇదైపోయింది. అదేదో సినిమా వాళ్ళే హైదరబాద్ ని చెడగొట్టేస్తున్నారు అనే టైపులో వార్తలు రాసింది. దాదాపు అన్నీ ఛానల్స్ ఇదే పరిస్థితి. అసలు ఈ రాకెట్ లో సినిమా వాళ్ళ పేర్లు లేకపోతె మీడియా ఇంత ఇదైపోయేదా ? అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే సినిమా వాళ్ళంటే అదో రకం మోజు.
ఈ కేసులో మరో విచిత్రం సిట్ ప్రశ్నల లీకేజీ. ఎంసెట్ పేపర్ లీక్ అయినట్లు విచారణలో సదరు వ్యక్తులకు ఏం ప్రశ్నలు అడిగారో గంటగంటకు మీడియాలో వచ్చేస్తుంది. ప్రశ్నలే కాదు. జబాబులు కూడా. అసలు ఇలా ఎందుకు బయటికి లీకులు వదులుతున్నారు ? ఇదే ప్రశ్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”మెరుగైన సమాజం కోసం” పనిచేసే ఒక ఛానల్ సినియర్ యాంకర్ ని లైవ్ లో అడిగాడు. దీనికి ఆ యాంకర్ గారు ఇచ్చిన సమాధానం.. ”కొన్ని వేగ్ లు వుంటాయి. ఆ వేగ్ ల ద్వారా మాకు సమాచారం వస్తుంది. ఇందులో ఎలాంటి అభూతకల్పనలు వుండవు. పక్కా సమాచారం ఇస్తారు మాకు” అని చాలా క్లియర్ కట్ గా ఒప్పుకున్నాడు. దీన్ని ఎలా చూడాలో అర్ధం కాదు. ఒక ప్రభుత్వ సంస్థ ఓ సీరియస్ ఇష్యు పై విచారణ జరుపుతుంది. కేసు ఇంకా విచారణ దశలోనే వుంది. ఇలాంటి నేపధ్యంలో సమాచారం అంతా చాలా పకడ్బందీగా వుంచుకోవాలి. కాని వేగ్ ల ద్వారా ఇలా విచారణను లీక్ చేయడాన్ని ఏమనుకోవాలి.? విచారణకు సంబధించిన వివరాలు మీడియాకు ఇవ్వాలి అనే నిభందన రాజ్యాంగంలో ఎక్కడైనా వుందేమో వారికే తెలియాలి. ఒకవేళ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని భావన కలిగితే సిట్ అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలి. కాని అలా జరగడం లేదు. ఈ విషయాన్ని మీడియా ఎంత సెన్సేషన్ చేస్తున్నా సిట్ అధికారులు చూస్తూ ఒరుకోవడం తప్పితే ఏమీ రియాక్షన్ ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ కేసును అటు సిట్ అధికారులు.. ఇటు మీడియా..సమాంతరంగా విచారిస్తున్నారా ? అనే భావన కలుగుతుంది.
ఇదంతా చూస్తుంటే.. ఈ కేసులో సెలబ్రిటీలు వున్నారు అన్న ఒక్క కారణంతోనే ఈ తలరుద్దుడు వార్తలు, కధనాలు ఇస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వాస్తవానికి డ్రగ్స్ అనేది హైదరాబాద్ కి కొత్తేం కాదు. 1993లోనే రెండు వందల యాబైకోట్ల రూపాయిలు విలివ చేసే డ్రగ్స్ ను హైరాబాద్ లో పట్టుకున్నామని ఒక రిటైర్డ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారి లైవ్ లో మాట్లాడుతూ చెప్పారు. అంటే ఇది ఈనాటిది కాదు. దీన్ని పెంచి పోషిస్తున్నది పెద్ద తలకాయలే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కోట్ల రూపాయిల డ్రగ్స్ ను పట్టుకుంటుంటార్ట. కానీ ఆ వార్తకు మీడియాలో పెద్దగా చోటు వుండదు. పత్రికలో ఏ చివరి పేజీలో చీమ తలకాయ లాంటి అక్షరాలతో ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ నలుగురు సినీ వాళ్ళ పేర్లు రావడంతో పత్రికల్లో తాటికాయంత అక్షరాలయ్యాయి. మీడియాలో 24/7 డ్రగ్స్ వార్తలతో హోరెత్తించేస్తున్నారు. సినిమా వాళ్ళు కాబట్టి విజువల్స్ కు డోకా వుండదు. ఇక దొరికిందే అదనుగా బెంబేలెత్తేస్తున్నారు. ఎదో జరిగిపోతుందనే భ్రమ వీక్షకుడిలో నింపేస్తున్నారు. విచారణలో ఏం తేలుతుందో కానీ.. మీడియానే ఒక తీర్పు ఇచ్చేసే పరిస్థితి కనిపిస్తుందక్కడ.
ఎవరినో సమర్ధించడం, ఎవరినో విమర్శించడం ఇక్కడ ఉద్దేశం కాదు. తప్పు ఎవరు చేసి తప్పే. శిక్ష పడిపోవాలి. అయితే విచారణ దశలోనే ఇలా గంధరగోళం చేసేయడం సమంజసం కాదనే అభిప్రాయం మాత్రమే.