- ” ఎంత ఎక్కువ మంట పెడితే.. అంత ఎక్కువ మరుగుతుంది..”
- “ఎంత ఎక్కువగా అన్యాయం జరిగితే అంత కోపం వస్తుంది…”
- “ఎంత ఎక్కువగా నష్టపోతే… అంత ఎక్కువగా విరక్తి వస్తుంది…”
- ” అవసరానికి మాత్రమే రియాక్షన్ బయటకు వస్తుంది..” …
ఇదంతా కామనే. ఇది మెగా బ్రదర్ నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు ” నా ఇష్టం” వీడియోలను చూస్తే.. వచ్చే రియాక్షనే. కానీ ఆయన వన్ సైడ్‌గానే ఎందుకు వెళ్తున్నారు..? ఏపీలో టీడీపీ, వైసీపీపైనే ఎందుకు వీడియోలు పెడుతున్నారు..? తన తమ్ముడ్ని నిద్రలేపే బాధ్యత తీసుకోరా..? తెలంగాణ పౌరుడిగా .. తన ప్రభుత్వంపై నోరెత్తే సాహసం చేయలేరా..?.
తమ్ములుంగారి “రక్తం మరిగినప్పుడు” ఏమైపోయారు…?
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసిందని… చంద్రబాబు అసెంబ్లీలో ఆవేశపడిన వీడియోను తీసి.. మంట ఎక్కువైతే.. మరుగుతుందని.. కామెడీ చేశారు నాగేంద్రబాబు. కొన్నాళ్ల క్రితం… ప్రత్యేకహోదా పేరుతో.. తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో సభలు పెట్టి.. తమ్ముడు పవన్ కల్యాణ్ చెలరేగిపోయారు. మోడీ తాట తీస్తానన్నారు. పిడికిలి బిగింగి గాల్లోకి విసిరారు. గుండెలు బాదుకుని… హోదా సాధించే వరకూ పోరాటం ఆగేది లేదన్నారు. కానీ ఇంటర్వెల్ తర్వాత సీన్ మారిపోయింది. మోడీ అంటే.. ఇష్టం, గౌరవం అంటూ.. మాట్లాడుతున్నారు. ప్రత్యేకహోదా కోసం.. ఆమరణదీక్ష చేస్తా.. అన్న ప్రకటన చేసి… ఏడాది గడిచిపోయింది. మళ్లీ ప్రత్యేకహోదా అనే మాటే తీసుకు రాలేదు. ముందుగా.. నాగబాబు.. తమ్ములుంగారి రాజకీయ ప్రయోజకత్వం గురించే మాట్లాడాలి…! ఆయనను.. సరైన పోరాట దారిలో పెట్టాలి. కేంద్రంపై.. యుద్ధానికి సిద్దం చేయాలి. మరిగిపోయిన తమ్ముడి రక్తాన్ని.. ఫలితం ఇచ్చే పోరాటం దిశగా మళ్లించే ప్రయత్నం చేయాలి.
ఏపీకి అన్యాయం జరిగినప్పుడు మెగా కుటుంబానికి ఎంతగా మరిగిపోయిందేమిటి..?
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మీద.. వెకిలి వెటకారాలు, వెగటు సెటైర్లు వేస్తున్నారు కానీ… తమరి బాధ్యత ఎంత నెరవేర్చారు. మామూలుగా సినిమా నటులైతే.. స్పందించకపోయినా ఎవరూ పెద్దగా అడగరు. కానీ..మెగా ఫ్యామిలీ.. రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 లక్షల మంది ఆ పార్టీకి ఓట్లేశారు. తర్వాత కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నారని చాలా మంది విమర్శలు గుప్పించారు. చిరంజీవి కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇంకా ఎక్కువగా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారు కూడా. ఇంతగా ప్రజల మద్దతుతో రాజకీయం చేసి.. పదవులు అనుభవించి.. విభజన సమయం సైలెంట్‌గా ఉండి… కనీసం ఏపీ ప్రయోజనాల కోసం.. ఎందుకు ప్రయత్నించలేదు. అంతా అయిపోయిన తర్వాత అయినా ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు చేస్తూంటే.. ఒక్క మాటంటే.. ఒక్క మాట కూడా చిరంజీవి మాట్లాడనప్పుడు… “నా ఇష్టం” అనే మాటలు ఎందుకు బయటకు రాలేదు. ఏపీ మొత్తం హోదా కోసం బందులు చేస్తున్నప్పుడు.. విశాఖలో సినిమా ఫంక్షన్ పెట్టుకుని… ఆడియో వేడుకలో ఆస్కార్ల డబ్బా కొట్టుకోవడమేనా మన స్వరాష్ట్ర భక్తి.
తెలంగాణ ఓటర్‌గా అక్కడి సమస్యలపై మాట్లాడటానికి భయమా..?
జగన్ రాష్ట్రాన్ని బిర్యానీలా తింటాడు… చంద్రబాబు… ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయలేదు.. ఆయనకు మంట పెడుతున్నారు కాబట్టి మరిగిపోతున్నారు.. లాంటి కామెంట్లు నా ఇష్టం అంటూ చేసుకుపోవచ్చు కానీ.. ఈ రెండు పార్టీల మీదనే ఎందుకు..?. తమ్ముడు పార్టీ జనసేన గొప్పగా కనిపిస్తోందా..?. జనసేనకు మేలు చేయడానికి.. ఇలా… వర్గ పోరాటాలను పెంచడానికి.. ఇలా ప్రయత్నాలు చేస్తున్నారా..?. తెలంగాణలో ఉంటూ.. పండగలకు, పబ్బాలకు కూడా.. ఆంధ్రప్రదేశ్‌కు రాని.. మెగా బ్రదర్.. ఏపీ రాజకీయాలపై ఎందుకు అంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు…? తెలంగాణలో ఓటు హక్కు ఉంది. అక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముందుగా.. ప్రశ్నించాల్సింది.. అక్కడ రాజకీయాన్నే. తెలంగాణ ఓటర్‌గా.. అక్కడి సమస్యలపై ఒక్క సారైనా గళమెత్తారా..? కనీసం ఓ ట్వీట్ చేశారా..? ఓ వీడియో పెట్టారా..?. పెట్టే ధైర్యం లేదా..? పెడితే.. అక్కడ ఉండనీయరని భయమా..?. రెండు నెలలుగా.. తెలంగాణలో మంత్రివర్గం లేకుండా పాలన సాగుతోంది. దమ్ముంటే.. దానిపై ఓ వీడియో పెట్టగలరా..?
నాగబాబు గారు.. మీకు ఇప్పుడే ఎందుకు కాలుతుందో మాకు తెలియదా..?
ప్రజారాజ్యం పార్టీ విషయంలో తెర వెనుక ఏం జరిగిందో కానీ… పార్ట్ -2 ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పార్టీకి మార్కెటింగ్ చేసుకోవడానికే మీ ప్రయత్నం. అందుకే.. జగన్… అవినీతి కనిపిస్తుంది. చంద్రబాబు మాటల్లో రాజకీయం కనిపిస్తుంది. ఆయన మాటలు వింటే మీకు కాలిపోతుంది. మీకు కావాల్సింది.. ప్రజారాజ్యం పార్ట్ -2కి ఆదరణ. అది రావాలంటే.. ఇతర పార్టీలపై నిందలేయాలి. ఎందుకంటే… ప్రజారాజ్యం అనుభవాల్ని ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు.. అవి మర్చిపోలేరు కాబట్టి… ఆదరణ దక్కదు. దీనికి రివర్స్ యాంగిల్లో.. ప్రయత్నిస్తేనే.. లాభం. అందుకే.. మీకు కాలిపోతుంది. జగన్, చంద్రబాబు ఏం చేసినా మీకు కాలిపోతుంది..! ఎన్నికలయ్యే వరకూ.. మాడిపోయినా సరే మీకు కాలిపోతూనే ఉంటుంది.