అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరచుకోబోతున్నాయి. నిజానికి నిర్మాతలంతా ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ వార్త వాళ్లలో ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయింది. ఎందుకంటే సిట్టింగ్ ని 50 శాతమే.. పరిమితం చేయడం అసలు కారణం. ఈ నిర్ణయం నిర్మాతలకు మింగుడు పడనివ్వడం లేదు. “విమాన ప్రయాణాల్లో ఎలాంటి పరిమితీ లేదు. థియేటర్లకు మాత్రమే 50 శాతం సిట్టింగ్ అంటే ఎలా? తనకు ఇబ్బందిగా ఉంటే.. థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ప్రేక్షకుడికి ఉంది. విమాన ప్రయాణికులకు అది కూడా ఉండదు కదా” అని ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద శాతం సిట్టింగ్ ఉన్నప్పుడే చిత్రసీమకు నష్టాలు రావడం పరిపాటిగా ఉంటుందని, సగం సీట్లంటే.. నిర్మాత మునిగిపోవడం ఖాయమని వాపోతున్నారాయన.
మరో బడా నిర్మాత డి.సురేష్‌బాబు వాదన కూడా ఇదే. షాపింగ్ మాల్స్ తెరచుకునే అవకాశం ఉన్నప్పుడు, సినిమాలకు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలకు ఇది నిజంగా కష్టకాలమని, ఇలాంటి స్థితిలో పెద్ద సినిమాలు విడుదలకు సాహసం చేయవని తేల్చేశారాయన. పైగా.. కేంద్ర ప్రభుత్వం థియేటర్లకు అనుమతులు ఇచ్చినా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిగా నిర్ణయం తీసుకోవాల్సివస్తుంది. కేంద్రం ఓకే అన్నా, రాష్ట్రాలు నో చెబితే థియేటర్లు తెరచుకోవు. ఏపీ, తెలంగాణలలో కరోనా ఉధృతి ఇంకా ఉంది. ఈ దశలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు తెరవడానికి ఒప్పుకుంటారా? అన్నది ప్రధాన ప్రశ్న. వాళ్లు ఒప్పుకున్నా నిర్మాతలూ రెడీగా లేరు. ఒకవేళ థియేటర్లకు అనుమతులు ఇస్తే.. 50 శాతమే సిట్టింగ్ అన్న షరతుని ఉపసంహరించుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.