కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. బలనిరూపణకు గవర్నర్ వజుభాయ్ వాలా 15 రోజులు టైమిచ్చారు. మెజారిటీ సంఖ్యాబలం లేదని తెలిసినా భాజపాకి గవర్నర్ అవకాశం ఇవ్వడం వివాదాస్పదమౌతున్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క, భాజపా చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రయత్నాలపై కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ప్రజాతీర్పును వెక్కిరించే విధంగా భాజపా వ్యవహరిస్తోందనీ, అధికార దాహంతో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని మేధావులు మండిపడుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు రూ. 100 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ తో భాజపా ప్రయత్నిస్తోందన్న కథనాలపై సామాన్యులపై ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. అయితే, నేటి ‘సాక్షి’ పత్రికలో ఈ పరిస్థితిపై ఒక్కటంటే ఒక్క కథనం కూడా లేదే..!
వైకాపా నుంచి టీడీపీకి ఎమ్మెల్యేలు జంప్ అవుతుంటే… ప్రతీరోజూ ఆ పత్రిక గగ్గోలు పెట్టేది. ప్రజాస్వామ్యం చచ్చిపోతోందనీ, ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా అడ్డగోలుగా తమ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసి మంత్రి పదవులు ఇచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసేది. అంతేకాదు, ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల్లేవనీ, వారితో రాజీనమాలు చేయించి ఎన్నికల్లో దింపే సత్తా లేదంటూ అధికార పార్టీ తీరుపై మండిపడుతూనే ఉంటుంది. నిజమే, ఫిరాయింపులు అనేవి కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైన వ్యవహారమే. ఫిరాయింపు నిషేధ చట్టం కూడా ఉంది. కానీ, దాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
ఒక పత్రిగా, వ్యవస్థలో నాలుగో మూలస్తంభంగా ఫిరాయింపు రాజకీయాల పట్ల ఒకే వైఖరి ఉండాలి. కానీ, ‘సాక్షి’ వ్యవహారం అలా కనిపించడం లేదు. తమ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కొడితే గగ్గొలు పెట్టిన ఆ పత్రికే… ఇవాళ్ల కర్ణాటకలో నిస్సిగ్గుగా అధికార దాహంతో రాజకీయాలు చేస్తున్న భాజపా విషయానికి వచ్చేసరికి ఎందుకు మౌనం దాల్చింది..? ‘ఎడ్యూరప్ప ఏలుబడి’ అంటూ రాసిన ఎడిటోరియల్ లో కూడా భాజపా చేస్తున్న ఫిరాయింపు రాజకీయాల ఊసే లేదు. అంతేకాదు, ఈ క్రమంలో భాజపాను వెనకేసుకొచ్చే ధోరణే కనిస్తోంది. కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు ఉంటే తప్ప, అధిక స్థానాలు సాధించలేమని కాంగ్రెస్, భాజపాలకు అర్థమై ఉంటుందని రాశారు. ఇదే సమయంలో… ఏపీలో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందనీ, అలాంటి చంద్రబాబు నాయుడుకి గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నించే నైతికతా ఉందా అని ప్రశ్నించారు. మరి, టీడీపీ ఫిరాయింపు రాజకీయాలపై అంతెత్తున ఆవేశపడుతున్నప్పుడు, భాజపా చేస్తున్న అదే తరహా రాజకీయాలపై అదే స్థాయిలో స్పందించాలి కదా! భాజపా విషయానికి వచ్చేసరికి ఈ సన్నాయి నొక్కులు ఎందుకు..?