మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. మోడీ గోబ్యాక్ అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పలుచోట్ల నిరసన చేపట్టారు. నటుడు శివాజీ కూడా నిరసనలో పాల్గొన్నారు. నల్ల చుక్క ధరించి కృష్ణా నది వద్ద దీక్ష చేశారు. ఆ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్, జగన్ మీద కూడా విమర్శలు చేశారు.
ప్రత్యేక హోదా బదులుగా ప్యాకేజీ ప్రకటిస్తున్నామని బిజెపి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు రాష్ట్రానికి ఇచ్చారంటూ బిజెపి మీద విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. నిజానికి అప్పటిదాకా ఇటు తెలుగుదేశం పార్టీ గాని అటు వైఎస్సార్ సీపీ కానీ బిజెపి మీద ఏనాడు కూడా విమర్శలు చేయలేదు. ఆ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సమస్య విషయంలో ఓపెనింగ్ బ్యాట్స్ మేనే. కానీ ఎందుకనో గత ఏడాదిగా పవన్ కళ్యాణ్ బిజెపి మీద ఆ స్థాయిలో విరుచుకు పడడం లేదు. అలాగే జగన్ ప్రత్యేక హోదా సమస్యలను ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ బిజెపి పెద్దల “మనో భావాలు ” గాయపడకుండా జాగ్రత్త పడుతున్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం లేదని పలుమార్లు వ్యాఖ్యానిస్తున్నారు తప్పించి మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని జగన్ గర్జించడం లేదు. దీంతో ఇప్పుడు నటుడు శివాజీ, హీరో పవన్ ని అటు జగన్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పాచిపోయిన లడ్డూలు అంటూ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని శివాజీ ప్రశ్నించారు. అలాగే మోడీ రాక సందర్భంగా ఇంతలా నిరసనలు వ్యక్తమవుతుంటే జగన్ ఏం చేస్తున్నారని శివాజీ ప్రశ్నించారు.
అయితే ఈ వ్యాఖ్యల్లో ఎంతో కొంత వాస్తవం ఉన్న మాట నిజమే అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు శివాజీ నుండి రావడం వల్ల నెటిజన్ ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ శివాజీ కేవలం తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారని, తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే తెర మీదకు వస్తా రని, గతంలో జగన్ ప్రత్యేక హోదా గురించి దీక్షలు చేసినప్పుడు కనీసం మాట వరసకు కూడా దీక్షకు సంఘీభావం తెలపలేదని, అలాగే పవన్ కళ్యాణ్ బిజేపి పై విరుచుకుపడ్డప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను స్వాగతిస్తూ ప్రకటన చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా, ఆ మధ్య ఆపరేషన్ గరుడ అంటూ హడావుడి చేసిన కారణంగా, అలాగే తెలుగుదేశం పార్టీకి అవసరమైనప్పుడు మాత్రమే తెర మీదకు వస్తున్న కారణంగా, శివాజీ తన విశ్వసనీయతను చాలావరకు కోల్పోయాడు. మరి శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి కానీ జనసేన కానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
– జురాన్