ఓ వైపు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరలను పూర్తి స్థాయిలో తగ్గించి… ఆ ధరల్లోనే అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం లేదని ధియేటర్లను సీజ్ చేస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ నిర్మాతలకు ఊరట కల్పించేలా జీఎస్టీ భారాన్ని ప్రేక్షకుడిపైనే వేయడం కాకుండా… ధియేటర్ నిర్వహణ కోసం విడిగా చార్జీలు వసూలు చేసునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే తెలంగాణలో సినిమా టిక్కెట్ రేట్ల పెంపును ఎవరూ వ్యతిరేకించడం లేదు. చివరికి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించడంలేదు.
ప్రజల్ని దోపిడీ చేయడానికి సినిమా వాళ్లకు పర్మిషన్ ఇచ్చారని కూడా అనడం లేదు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వంపై కనీసం విమర్శలు అయినా రావాలి. కానీ ఎవరూ తెలంగాణ నిర్ణయాన్ని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే సినిమా అనేది నిత్యావసరం కాదు. డబ్బులున్న వారు వెళ్తారు.. లేకపోతే లేదు. భారం అనుకుంటే వెళ్లడం మానేస్తారు. ఓటీటీ సహా ఎన్నో వినోద సాధనాలు అందుబాటులో ఉన్నాయి. సినిమాకు వెళ్లడం నిర్బంధం కాదు. ధర ఎక్కువని జనం ఆగిపోతే.. అసలు సినిమా ఇండస్ట్రీకే నష్టం. ఆ విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో వారికేనా.. ఏపీ వారికి క్లారిటీ ఉండదా అంటే.. అందరికీ ఉంటుంది.
కానీ ఏపీలో ఉన్న అధికార పక్షం అజెండా వేరు. వారు అధికారం అనే ఆయుధంతో ఏమైనా చేయగలమని.. ఎవరి ఉపాధినైనా అడ్డంగా నరికేయగలమని నిరూపించాలనుకుంటున్నారు. అందుకే అక్కడ టిక్కెట్ రేట్లపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ఉంది. ఏ వస్తువుకైనా ఎమ్మార్పీ ఉంటుందని మంత్రులు చెబుతున్నారు.. కానీ ఆ ఎమ్మార్పీని ప్రభుత్వం కాదు….తయారీదారులే నిర్ణయిస్తారన్న విషయాన్ని అంగీకరించడం లేదు. మొత్తంగా ఈ అంశంపై సినిమా ప్రేక్షకులు రెండు రాష్ట్రాల పరిణామాలను పోల్చి చూస్తాడు. నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటాడు. !