తమిళ హీరో విజయ్ కి తెలుగులో చెప్పుకోదగ్గ మార్కెట్ వుంది కానీ ఆయనకే తెలుగు మార్కెట్ పై పెద్ద శ్రద్ధ లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో విడుదలౌతాయి. కానీ ఆయన మాత్రం ఇక్కడ కనీసం ఒక్క ప్రెస్ మీట్ కి కూడా హాజరవ్వరు. ఈవారం విజయ్ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా తెలుగులో విడుదల కానుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేస్తున్నారు.
గతంలో ‘లియో’ రిలీజ్ సమయంలో లోకేష్ కనకరాజ్ కారణంగా మంచి బజ్ వచ్చింది. అలాగే ‘వారసుడు’ కి దిల్ రాజు ప్రొడక్షన్ కలిసొచ్చింది. కానీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కి రావాల్సిన బజ్ రాలేదని చెప్పాలి. ఇలాంటి సమయంలో విజయ్ సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగివుంటే ఎంతోకొంత ఊపు వచ్చేది. మైత్రీ మూవీస్ రిలీజ్ కి ముందుకి రావడంతో వారు విజయ్ ని ప్రీరిలీజ్ ఈవెంట్ కి తీసుకురాగలరేమో అనుకున్నారు. కానీ ఈసారీ విజయ్ హ్యాండ్ ఇచ్చారు. ఎలాంటి సందడి లేకుండానే ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది. విజయ్ కి ఎందుకో మొదటి నుంచి తెలుగు మార్కెట్ మీద ఫోకస్ లేదు. ఈ సినిమా విషయంలో కూడా విజయ్ లో మార్పు రాలేదు. కాకపోతే.. మైత్రీ మూవీస్ మాత్రం `సక్సెస్ మీట్ కు తప్పకుండా తీసుకొస్తాం` అంటూ హమీ ఇస్తున్నారు. ఓ వైపు కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లు ఊరూరా తిరుగుతూ తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకొంటుంటే, విజయ్ మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కేస్తున్నాడు.