తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు అచ్ఛే దిన్ వచ్చినట్టే. లలిత్ మోడీ వివాదంలో తొలి వికెట్ సుష్మా స్వరాజ్ దే అని అప్పట్లో చాలా మంది భావించారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉంటూ, లలిత్ యూకే వీసా పొందడానికి సహాయం చేసిన సుష్మా వ్యవహారం దుమారం రేపింది. లలిత్ భార్యకు క్యాన్సర్ సర్జరీ చేయాల్సి ఉండటంతో మానవత్వంతో సహాయం చేశానని సుష్మా ఒప్పుకున్నారు. దీంతో ఆమె అక్రమాలకు పాల్పడలేదని దేశంలో చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోశాయి.
ఈ నెల 21 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో లలిత్ మోడీ అంశంపై సభ దద్దరిల్లడం ఖాయమంటున్నారు. అయితే, సుష్మాను ఇబ్బంది పెట్టవద్దని నాలుగు కీలక ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, ములాయం సింగ్ పార్టీ సమాజ్ వాదీ పార్టీ, శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ కు చెందిన జనతా దళ్ యునైటెడ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా. ఈ నాలుగు పార్టీ నాయకులూ తమ ఫోన్ సంభాషణల్లో దీనిపై ఓ అంగీకారానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మొదటి నుంచీ సుష్మా స్వరాజ్ నడవడికే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సుష్మా, ఎప్పుడూ హుందాగా వ్యవహరించారని, వివాదాల జోలికి పోలేదని పేరుంది. ప్రతిపక్ష నాయకులతోనూ పరుషంగా మాట్లాడిన సందర్భాలు లేవు. సైద్ధాంతిక విమర్శ తప్ప, ఆమె ఎప్పుడూ తమను వ్యక్తిగతంగా విమర్శించలేదని ఈ పార్టీల నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. విపక్షాల వారితోనూ మర్యాదగా మెలగుతూ సత్సంబంధాలు కొనసాగించడం ఇప్పుడు సుష్మాకు కలిసివచ్చింది.
లోక్ సభలో లలిత్ మోడీ అంశంపై రగడ జరిగేటప్పుడు, సభను స్తంభింప చేసే సమయంలో సుష్మా ప్రస్తావనను తేవద్దని ఈ పార్టీలు భావిస్తున్నాయి. వసుంధర రాజె, ఇతరుల గురించి మాత్రం ప్రస్తావిస్తారు. అయితే కాంగ్రెస్ మాత్రం యథావిధిగా సుష్మాతో సహా బీజేపీ వారందరిపైనా విమర్శల దాడి చేయబోతోంది. ప్రధాని మోడీపై లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో దాడి చేయబోతోంది. దీంతో ఉభయ సభలూ దద్దరిల్లబోతున్నాయని విపక్షాలు ముందే చెప్తున్నాయి. సుష్మా వరకూ ఇబ్బంది లేకపోయినా, మొత్తానికి విపక్షాల దాడిని మోడీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.