సిరివెన్నెలకు `పద్మశ్రీ` వచ్చింది. ఆ పురస్కారానికి ఆయన అర్హుడు కూడా. వేటూరి తరవాత… అంతటి స్థాయి ఉన్న వ్యక్తి. అంతటి కీర్తి గడించిన రచయిత ఆయనే. అయితే ఈ పద్మశ్రీకి ఉన్న విలువ ఇంకా చిత్రసీమ గుర్తించినట్టు కనిపించడం లేదు. పరిశ్రమ తరపున సన్మానాలూ సత్కారాలూ ఆయనకు ఇంత వరకూ లభించనేలేదు. అంతెందుకు… గీత రచయితలెవరూ పెద్దగా స్పందించినట్టుగా కనిపించడం లేదు.
నిజానికి సినారె తరవాత పద్మ పురస్కారం అందుకున్న గీత రచయిత సీతారామశాస్త్రి మాత్రమే. సినారె కేవలం పాటల రచయితగానే `పద్మ` అందుకోలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అప్పటికే జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన గొప్ప రచయిత. కాబట్టి ఆయనకు పద్మ పురస్కారం వస్తే.. కేవలం సినీ రచనకే ముడి పెట్టాల్సిన పని లేదు. సీతారామశాస్త్రి అలా కాదు. కేవలం పాట ద్వారానే పద్మశ్రీ తెచ్చుకున్నాడు. అంతే కాదు.. ‘నాకు పద్మశ్రీ కావాలి’ అని ఆయన ప్రభుత్వానికి అప్లై చేసుకోలేదు. ప్రభుత్వమే ఆయన్ని గుర్తించి పద్మశ్రీ ప్రకటించింది. ఇన్ని విశిష్టతల మధ్య ఆయనకు పద్మ వస్తే.. గీత రచయితలెవరూ ఆయన్ని కలుసుకున్నట్టు, తమ స్పందన తెలియజేసినట్టు కనిపించడం లేదు. అంతెందుకు… ‘నా దత్త పుత్రుడు’ అని చెప్పుకునే కృష్ణవంశీ సైతం ఇప్పటి వరకూ స్పందించిన దాఖలాలు లేవు. సీతారాముడికి పద్మశ్రీ దక్కడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారా? లేదంటే ఆయన ప్రతిభకు పద్మశ్రీ అనేది చాలా తక్కువ అని భావిస్తున్నారా?? వివరమేంటో వాళ్లకే తెలియాలి.