వైకాపాలో తనను తాను నంబర్ టుగా భావిస్తారు ఎంపీ విజయసాయి రెడ్డి అనే విమర్శ ఆ పార్టీ వర్గాల్లోనే కొంతమందిలో ఉంది! అంతేకాదు, పార్టీ పెట్టిన దగ్గర్నుంచీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న సీనియర్లను ఒక పద్ధతి ప్రకారం ఆయనే పక్కకు జరిపారనే గుసగుసలు కూడా విన్నవే. సరే, ఏదేమైనా ఈ మధ్య పార్టీ కార్యకలాపాల్లో ఆయన కీలకంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా చేరాలన్నా, చేర్చుకోవాలన్నా ఆయనే చర్చకు దిగుతున్నారు. ఆయనే దగ్గరుండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మంచిదే! ఇదే తరహాలో పార్టీకి ఎదురయ్యే సమస్యలపై కూడా ఆయన స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి సందర్భమే… సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికీ, జగన్మోహన్ రెడ్డికీ పెరుగుతున్న దూరం.
ఈ తరుణంలో విజయసాయి చొరవ తీసుకోవచ్చు. టిక్కెట్ విషయమై రెండు కుటుంబాల మధ్య అభిప్రాయ బేధాలను తగ్గించొచ్చు. కానీ, ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రయత్నం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి వర్గం, బాలినేని వర్గం ఉన్నాయి. వీళ్లిద్దిరిదీ ఎవరిదారి వారిది. అయితే, ఈ సమయంలో ఈ రెండు వర్గాలను పక్కనపెట్టేసి… జిల్లా నుంచి కొత్తవారిని పార్టీలో చేర్చే పనిలో ఈ మధ్య విజయసాయి నిమగ్నమై ఉండటాన్ని చూస్తున్నాం. అంటే, వైకాపాలో కీలకమైన నేతల దూరమౌతున్న వాతావరణం కనిపిస్తుంటే… దాన్ని తగ్గించే విధంగా ఆయన ప్రయత్నాలు కనిపించడం లేదు. మరి, ఈ తీరును జగన్ గమనిస్తున్నారా… జగన్ తీరునే ఈయన అమలు చేస్తున్నారా అనేదే ప్రశ్న..?
మొదట్నుంచీ విజయసాయి తీరు ఇలానే ఉంటోంది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్టీ ఎంపీలంతా రాజీనామా చేయాలని నిర్ణయిస్తే… ఆయన మాత్రం చెయ్యలేదు! ఢిల్లీ రాజకీయాల్లో ఆయన కీలకం అయ్యేందుకు మరో సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రాధాన్యతను పార్టీలో తగ్గించారనే గుసగుసలూ ఎప్పట్నుంచో ఉన్నాయి. దానికి అనుగుణంగానే మేకపాటి అసంతృప్తిపై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఏ స్థాయి నేత విమర్శలు చేస్తామన్నా… వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు. ఆ మధ్య మోత్కుపల్లి నుంచి తాజాగా ఏపీలో సభలంటున్న తెలంగాణ నేత వరకూ… వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చేస్తుంటారు. ఇవి పార్టీకి ఏమంత మైలేజ్ ఇచ్చే అంశాలు కానే కావు. తాజా పరిస్థితుల్లోగానీ, అంతకుముందుగానీ… తననితాను పార్టీ పెద్ద స్థానంలో చూసుకుంటున్న విజయసాయి పనితీరు క్రియాశీలంగా ఉంటోందా అనేదే కొంతమందికి కలుగుతున్న అనుమానం.