మాకు డబ్బులివ్వలేదు కాబట్టి మేము ఓట్లేయం అని మునుగోడులో కొంత మంది మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం చూసి.. ప్రజాస్వామ్య వాదులు .. నోళ్లు నొక్కుకుని ఉంటారు. కానీ కొన్ని చోట్ల ..తక్కువ ఇచ్చారని కూడా ఓటు వేయడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యంలో వచ్చిన చైతన్య అనుకోవాలా లేకపోతే.. ప్రజాస్వామ్య పునాదులు కాస్తా.. డబ్బులో కూరుకుపోయాయని బాధపడాలా ?. ఏదైనా ఈ దుస్థితికి మొదట రాజకీయ నాయకులదే బాధ్యత.
కోట్లకు అమ్ముడుబోతున్న ఎమ్మెల్యేలు – కొంటున్నపార్టీలు !
వేలంపాటలో కొనుక్కుంటున్నట్లు.. ఓ రిసార్టులో ఎమ్మెల్యేలకు రేటు కడుతున్న దృశ్యాలను తెలంగాణ సీఎం. చిన్నతెర మీద ప్రదర్శించారు. రికార్డు చేశారు కాబట్టి తెలిసింది. రికార్డుచేయని బాగోతాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఎవరు ఎవరిని కొన్నారు. ఎవరు ఎందుకు ఇరికించారు. వెనుక ఉన్న వాళ్లెవరూ.. ముందుండి నడిపించేదెవరూ అన్న విషయాలు జనాలకు కూడా తెలిసినవే. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అధికారంలో ఉండిఅడ్డగోలుగా ప్రజల్ని … ప్రజా సంపదను దోచుకున్న డబ్బుతో వారు ఈ పనులు చేస్తారు.
ఓటు ఐదు వేలిచ్చామని.. చట్టసభల్లోనే చెప్పేస్తున్నారు !
కుప్పంలోని లోకల్ బాడీ మీటింగ్ లో ఐదువేలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం అని ఓ ప్రజాప్రతినిధి భర్త నేరుగానే అన్నాడు. అసలు ప్రజాప్రతినిధి భర్త ఆ మీటింగ్ కు ఎందుకు వచ్చాడన్నది .. ఎలా రానిచ్చారన్నది కూడా సమస్యే. అక్కడ అధికారులు కూడా తమ విధిని నిర్వహించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఫార్మ్ హౌస్ ఫైల్స్ అనే సినిమాలో కీ రోల్స్ చేసిన ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్ వాళ్లే. “కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నిస్తే.. టీఆరెస్ బాధపడుతోంది.” టీఆరెఎస్ కు నైతికత ఎక్కడిది.
డబ్బులివ్వకపోతే ఓటేసేది లేదనేలా మారిపోతున్న ఓటరు చైతన్యం !
మరి నాయకులు అమ్ముతున్నారు.. కొంటున్నారు అని గోల చేస్తున్నాం కానీ… జనాల సంగతేంటి.. నిన్నటికి నిన్న మునుగోడులో మాకిచ్చేది మూడేవేలా.. ఐదువేలా అంటూ.. జనం గోల చేశారు. పైసలు చాలవు.. బంగారం కావాల్నంటూ నేరుగా డేరుగా అడిగారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది. అమ్మకం.. కొనడం అన్నది అత్యంత నార్మల్ విషయం అన్న అవగాహనలోంచి వచ్చింది. ఎమ్మెల్యేలనే కొంటున్నప్పుడు.. మాదేందని వాళ్లు అంటున్నారు. జనంతో గెలవాలి.. ఓట్లు వేస్తేనే అధికారం అన్న పరిస్థితి లేదు. డబ్బులుంటే అధికారం ఎప్పుడూ ఉంటుందన్న స్థితికి ప్రజాస్వామ్యం జారిపోయింది.