“డాన్” అనే నాగార్జున సినిమా ఒకటి ఉంటుంది. అందులో అవడానికి హీరో నాగార్జునే. కానీ.. నాగార్జును.. కుర్చీలో కూర్చోబెట్టి… అన్నీ తనే చేసేస్తూంటాడు లారెన్స్, ఫైట్లు, పాటలు, రొమాన్స్.. అన్నీ తనే చేస్తాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డిని డాన్ని చేసి.. కుర్చీలో కూర్చోబెట్టారు. వ్యవహారం అంతా.. టీఆర్ఎస్ , బీజేపీలు నడిపిస్తున్నాయి. టీఆర్ఎస్ది మరీ యాక్టివ్ రోల్. డాన్ సినిమాలో లారెన్స్‌ను మించిపోయే క్యారెక్టర్. నేరుగా .. టీడీపీతో టీఆర్ఎస్సే తలపడుతోందన్నట్లుగా ఉంది పరిస్థితి.
జగన్ సైలెంట్ మోడ్‌లో ఎందుకున్నారు..?
పాదయాత్ర ముగిసి రెండు నెలలు పూర్తయిపోయింది. ఎన్నికలు ముంగిటకు వచ్చేసింది. ఇంత వరకూ జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయిన పరిస్థితి ఎక్కడా లేదు. ప్రశాంత్ కిషోర్ తన టీంతో కలిసి.. టిక్కెట్ల కసరత్తు చేస్తున్నారు. బుజ్జగింపులు కూడా ఆయనే. చేరికలు కూడా ఆయనే చేస్తున్నారు. ఎక్కడెక్కడ మంచి అభ్యర్థి కావాలో..స్కెచ్ వేసుకుని.. ఢిల్లీ, హైదరాబాద్‌లతో కోఆర్డినేట్ చేసుకుని.. కావాల్సిన సంప్రదింపులు చేసుకుని.. చేర్చుకుంటున్నారు. జగన్ మాత్రం డాన్ స్టైల్లో..స్టైల్‌గా వారికి కండువాలు కప్పి.. చిరునవ్వులు చిందిస్తున్నారు. గతంలో… ఆయనను అటూ ఇటూ కాని వ్యక్తిగా పోల్చిన వారితోనూ.. తన పార్టీని షకీలా సినిమాతో పోల్చిన వారితోనూ.. ఇంకా తనకంటే పొడుగు ఉన్న వారిని కూడా.. పార్టీలోకి చిరునవ్వుతో ఆహ్వానించాల్సి వస్తోంది. అంతకు మించి జగన్ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు.
టీడీపీని నేరుగా ఢీకొడుతున్న టీఆర్ఎస్..!
అసలు వైసీపీ చేయాల్సిన పోరాటం.. టీఆర్ఎస్ నేరుగా చేస్తోంది. వైసీపీ టీఆర్ఎస్కు బ్యాటన్ ఇచ్చి చోద్యం చూస్తోంది. టీఆర్ఎస్.. తెలుగుదేశం పార్టీని ఓడించాల్సిందేనని పట్టుదలగా ఉంది. వైసీపీకి ఆర్థిక సాయం చేసి సైలెంట్‌గా ఉండటం.. టీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదు. ఎందుకంటే.. జగన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్… ఆయనను గెలిపించవని.. టీఆర్ఎస్ నాయకత్వానికి అర్థమైనట్లుగా ఉంది. అందుకే తామే స్వయంగా రంగంలోకి దిగారు. చేయగలిగినదంతా చేస్తున్నారు. ఓ సారి తలసానిని ఏపీ మీదకు పంపుతారు. మరోసారి టీడీపీ యాప్ సర్వీస్ కంపెనీపై కేసులంటారు. ఇలా.. రకరకాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం… టీఆర్ఎస్ నేరుగా టీడీపీతో పోరాడుతోంది. కానీ వైసీపీ జాడ మాత్రం కనిపించడం లేదు.
ఉడతా భక్తిగా బీజేపీ సాయం..!
బీజేపీ నేతలు ఉడతా భక్తి సాయం చేస్తున్నారు. ఆ పార్టీకి ఉన్న బడా నేతలు సోము వీర్రాజు లాంటి వాళ్లు సాయం చేస్తే మహా అయితే ఓటు వేయగలరు. అందుకే.. మోడీ, షాలే వస్తున్నారు. మోదీ, అమిత్ షాలు … ఏపీకి ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోతున్నారు. వాళ్లెంత వచ్చి పోయినా తెలంగాణలో ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. ఏపీలో.. ఒక్క దాంట్లో డిపాజిట్లు రావు. ఆ విషయం వాళ్లకి తెలుసు. అయినా వచ్చి పోతున్నారు మోడీ రెండు సార్లు ఏపీకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి… మోడీ, అమిత్ షా ల పర్యటనలపై ఒక్క మాట కూడా మాట్లాడరు. దీన్ని బట్టి చూస్తే.. అసలు బీజేపీ నేతలు.. ఏపీలో చేసే రాజకీయాలు తమ కోసం కాదు.. జగన్మోహన్ రెడ్డి కోసం అని అర్థం చేసుకోవచ్చు.
వాళ్లే గెలిపిస్తారని జగన్ రిలాక్సయిపోతున్నారా..?
కొన్నాళ్ల కిందట… ప్రశాంత్ కిషోర్‌ని పరిచయం చేసేటప్పుడు.. జగన్ ఈయన మోడీని ప్రధానమంత్రిని చేశాడు.. ఇప్పుడు నన్ను గెలిపిస్తాడు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అందులో కొద్దిగా బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. ప్రత్యక్షంగా అయినా.. పరోక్షంగా అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో తన గెలుపు అనేది.. ఇతరులు సాధించి పెడతారనే భావిస్తున్నారు. కేసీఆర్ లక్ష్యం చంద్రబాబు ఓటమి. కేసీఆర్ ఏపీలో పోటీ చేయలేడు కాబట్టి.. వేరే వాళ్లను గెలిపించాలి. దానికి ఆయన జగన్‌ను ఎంచుకున్నారు. జగన్‌తో పవన్ కల్యాణ్‌ను కలిపేందుకు కూడా ప్రయత్నించారు. తాను సొంతంగా.., రాజకీయం చేస్తే గెలుస్తానో లేదో అన్న నమ్మకం లేకపోవడంతో.. ఇతరులు ఎవరైనా వచ్చి గెలిపిస్తారేమోన్న ఆశతో.. జగన్మోహన్ రెడ్డి… ఉన్నారని తాజా పరిణామాలతో నిరూపితమవుతున్నాయి.
మొత్తానికి జగన్ నక్క తోకనో.. కుక్క తోకనో తొక్కాడు. తనకు డబ్బు ఖర్చు లేదు.. అభ్యర్థుల ఎంపిక లేదు.. ప్రచారం పైపైన చేసుకోవచ్చు.. కానీ .. గెలుపు కోసం.. చెమటోడ్చేవాళ్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్నారు. దీని వల్ల జగన్‌కు లాభమా.. నష్టమా.. అంటే.. ఎన్నికల్లో గెలిస్తే నక్కతోకను తొక్కినట్లు.. గెలవకపోతే.. కుక్కతోకను తొక్కి.. పిక్క పట్టుకునేలా చేసుకున్నట్లు.. ! దట్సాల్..!