ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ వర్గాలు ఇంత వరకూ కాకుండా మూడురాజధానుల బిల్లు కూడా పెట్టబోతున్నట్లుగా మీడియాకు లీక్ ఇచ్చాయి. దీంతో వైసీపీ అనుకూల.. వ్యతిరేక మీడియాలు వారి వారి వెర్షన్లలో కథనాలు రాస్తున్నాయి. కానీ మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టడం సాధ్యం కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.
గత నవంబర్‌లో హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకుది. దీంతో ఆ పిటిషన్లపై విచారణ ముగించాలని ప్రభుత్వం కోరింది. రైతులు వాదనలు వినాలని కోరుతున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడువస్తుందో స్పష్టత లేదు. తీర్పు రాకుండా మూడు రాజధానుల అంశం హైకోర్టులో ఉండగా కొత్త బిల్లు పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ తీర్పు వచ్చినా రైతుల పిటిషన్లపై విచారణ సాగించాలని తీర్పు ఇస్తే అసలు సాధ్యం కాదు.
అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలను.. న్యాయస్థానాలనూ పట్టంచుకున్న పరిస్థితిలేదు. తాము అనుకున్నది చేయడమే. తర్వాత ఎదురు దెబ్బలు తగిలినా అదో అడ్వాంటేజ్‌గా ప్రచారం చేసుకోవమే చూశాం. అందుకే బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించేసి గవర్నర్‌కు పంపేస్తుందన్న అంచనాలు ఉన్నాయి . ఇలా చేయడం వల్ల మూడు రాజధానుల విషయాన్ని మరింతగా చిక్కుల్లో పెట్టేయడమే తప్ప ప్రభుత్వానికి నిజంగా చేయాలని ఉండదన్న విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే చేయాలనుకుంటే పద్దతిగా చేస్తారు. కానీ కోర్టుల్లో ఆగిపోయేలా.. నిబంధనలకు వ్యతిరేకంగా చేయడం అది చేయకూడదన్న ఉద్దేశతోనే చేసినట్లుగా భావిస్తారు.
మరో వైపు రాజధాని భూములు పేరుతో రైతులు ఇచ్చిన భూముల్ని తాకట్టు పెడుతున్నారు. రేపు రాజధానిని తరలిస్తానంటే తాకట్టు పెట్టుకున్న వారు ఎందుకు ఒప్పుకుంటారు ?. ప్రభుత్వం అమరావతిని అడ్డగోలుగా నరికేసినా ఆ మిగిలిన వాటిని ఏరుకుని అనుభవించాలని అనుకుంటోంది. కాబట్టి రాజధాని మార్పుపై రచ్చ చేస్తారు కానీ ముందుకు కదిలించలేరన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.