నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకొన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమ ఆయన్ని ఘనంగా సన్మానించబోతోంది. ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరిగే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ కు చెందిన అతిరథమహారథులంతా పాల్గొనబోతున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, అఖిల్, విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, గోపీచంద్… ఇలా చాలామంది హీరోలు పాలు పంచుకొంటున్నారు. అలనాటి కథానాయికల్లో కొంతమంది ప్రముఖులు కూడా వేదికపై కనిపించనున్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర సీమల నుంచీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రాతినిధ్యం ఉండబోతోంది.
అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కనిపించడం లేదు. బాలయ్యతో వీరి మధ్య వచ్చిన గ్యాప్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ వేదికపై హీరోలంతా కనిపించి, నందమూరి హీరోలు మిస్ అయితే, నందమూరి హీరోల మధ్య ఏం జరగబోతోంది? అనే చర్చ మళ్లీ మొదలవ్వడం ఖాయం. వీళ్లకు ఆహ్వానాలు అందాయా? అందినా ‘రాను’ అన్నారా? లేదంటే అసలు హైదరాబాద్ లోనే లేరా? ఈ విషయాలపై టాలీవుడ్ తీవ్రంగా చర్చిస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులెవరో తెలుగు చిత్రసీమ అధికారికంగా ప్రకటించడానికి శుక్రవారం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. కానీ చివరి క్షణంలో ఆ జాబితా బయట పెట్టలేదు. అయినా సరే… లిస్టు దాదాపుగా బయటకు వచ్చేసింది. అందులో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లు లేవు.
అయితే తెలుగు చిత్రసీమ మాత్రం ఎలాంటి కాంట్రవర్సీల ప్రభావం ఈ ఈవెంట్ పై పడకూడదనుకొంటోంది. ‘హీరోలందర్నీ పిలిచాం. వాళ్లు రావాలా, వద్దా? అనేది వాళ్ల నిర్ణయం. సౌలభ్యాన్ని బట్టి వస్తారు. లేదంటే లేదు. దీన్ని కాంట్రవర్సీ చేయాలని చూడొద్దు’ అని ఓ ప్రముఖ నిర్మాత మీడియాను కోరారు. అయితే.. సోషల్ మీడియా, అందులో జరిగే ఫ్యాన్ వార్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. బాలయ్య వేడుకకు మిగిలిన హీరోలంతా వచ్చి, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రాకపోతే.. అభిమానులు చూసే కోణం వేరేలా ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు.