తెలంగాణ బీజేపీ పోయిన చోటే వెదుక్కునే ప్రయత్నంలో కూడా ఫెయిలయిందన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. బీసీ ఆత్మగౌరవసభలో ప్రధాని మోదీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకున్నారు. అలా ప్రకటించినట్లయితే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో కదలిక వస్తుందని. .. బండి సంజయ్ ను తప్పించిన అంశం పక్కకుపోతుందని అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ సీఎం అభ్యర్థిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధించారు. ఆయనకు మున్నూరు కాపు వర్గం అండగా నిలిచింది. . ఆయనను కారణం లేకుండా తప్పించడంతో ఆ వర్గం బీజేపీపై అసంతృప్తికి గురైంది.
ఇప్పుడు బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే…. పార్టీకి వచ్చిన మైనస్ అంతా పోయి ఉండేదని.. మళ్లీ బీజేపీ రేసులోకి వచ్చి ఉండేదన్న అభిప్రాయంరాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మున్నూరుకాపు వర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు పలుకుతారని అనుకున్నారు. ఆయన కాకపోతే ఈటల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గం కేసీఆర్ ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ముదిరాజ్ వర్గానికి ప్రధాని మోదీ సీఎం అభ్యర్థిగా చాన్స్ ఇస్తే వారంతా ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కానీ ఎవర్నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు.
బీజేపీ హైకమాండ్ కు దక్షిణాది రాజకీయాలు అర్థం కావడం లేదని ఇక్కడి నాయకుడు ఫీల్ అవుతున్నాయి. బీజేపీని చేజేతులా డౌన్ గ్రేడ్ చేసుకోవడం ఎవరైనా చేస్తారా అని మథనపడుతున్నారు. ఇప్పుడు సృష్టించుకున్న అవకాశాల్లోనూ తప్పులు చేస్తూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.