టీడీపీతో కలిసి పని చేయాలనే ప్రతిపాదనను పవన్ కల్యాణ్ పెట్టారని.. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని ఏపీ బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకుంటున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు ఇలా మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఏపీ బీజేపీ నేతలు ఇలా చెప్పలేదు. కుటుంబపార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తు ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు విషయంపై మాట్లాడుతున్నారు. పొత్తులపై జనసేన , బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు కానీ..టీడీపీ మాత్రం మాట్లాడటం లేదు. అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుపుతున్నారో కానీ.. బయట మాత్రం టీడీపీ తన పని తాను చేసుకుంటూ పోతోంది.
బీజేపీ.. వైసీపీకి దగ్గరగా ఉంది.. ఆ మాట మేం చెప్పడం లేదు.. ప్రజలే అనుకుంటున్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో ఓ అర్థం ఉంది. బీజేపీకి దూరమని నిరూపించుకోవాలని బీజేపీకి ఆయన సలహా ఇచ్చినట్లయింది. నిజానికి ఈ బాధ బీజేపీకి కూడా ఉంది. ఇప్పుడు వైసీపీ, బీజేపీ ఒక్కటేనని మేం అనడం కాదు.. ప్రజలే అనుకుంటున్నారు అని ఇటీవల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన మాధవ్ మధనపడ్డారు. వైసీపీకి బీజేపీ దూరం అని నిరూపించాలంటే ఏం చే్యాలో అచ్చెన్నాయుడే పరోక్షంగా చెప్పారు.
కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు వ్యక్తిగతంగా అందుతున్న సాయాన్ని నిలిపివేయాలని అంటున్నారు. అంటే ప్రభుత్వానికి అడ్డగోలు అప్పులు ఆపేయడం, నిబంధనల ప్రకారం పాలించేలా చేయడం, చట్ట విరుద్ద పనలును తక్షణం నిలిపివేసేలా చూడటం వంటివి టీడీపీ అజెండాలో ఉండవచ్చు. అవి చేస్తే బీజేపీతో పొత్తులపై ఆలోచిస్తామని టీడీపీ నేతలు చెప్పే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత కేసుల విషయంలోనూ వైసీపీకి బీజేపీ సహకరిస్తోందన్న అభిప్రాయం ఉంది. దాన్ని కూడా మార్చాలంటున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని రాజ్యాంగ వ్యతిరేకత నిర్ణయాలు తీసుకుందో లెక్కే లేదు. వాటి గురించి ప్రస్తావిస్తోంది.
ఇప్పుడు బీజేపీ… టీడీపీ, జనసేనతో కలిసి నడవాలంటే ఖచ్చితంగా వైసీపీకి దూరమని ఫ్రూవ్ చేసుకోవాలి. లేకపోతే.. దగ్గరకు వస్తామన్నా చేర్చుకోరు.