తెలంగాణలో బీజేపీ 7 -9 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంతా అబద్దమేనా..? ఆ పార్టీ కేవలం గతంలో కన్నా ఓ సీటు మాత్రమే అదనంగా గెలుచుకోనుందా..? ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఎగ్జట్ ఫలితాలకు దూరంగా ఉండనున్నాయా..?
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి. ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో తాము నాలుగైదు సీట్లు సాధిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది.
ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ పై పెద్దఎత్తున చర్చ నడుస్తుండగా ఈ ట్వీట్ వైరల్ కావడంతో పార్టీ అధికారిక ఖాతా నుంచి ఆ పోస్ట్ ను తొలగించింది. అయితే, బీజేపీకి నిజంగానే తెలంగాణలో నాలుగైదు సీట్లకు మించి రావని జేపీ నడ్డాకు పక్కా సమాచారం ఉండటంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక ఇప్పుడున్న సిట్టింగ్ స్థానాలకు అదనంగా మరో నాలుగైదు సీట్లను సాధిస్తామని చెప్పే క్రమంలోనే ఆయన కామెంట్స్ మరోలా కన్వె అయ్యాయా..? అనే చర్చ జరుగుతోంది.
బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి ఈ ట్వీట్ చేయడంతో ప్రత్యర్ధి పార్టీలకు ఇదొక అస్త్రంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ తప్పుడు నివేదికలు ఇచ్చినా జేపీ నడ్డా మాత్రం వాస్తవాలను వెల్లడించారని చెబుతున్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా..? లేక జేపీ నడ్డా జోస్యం ఫలిస్తుందా..? అనేది మంగళవారం స్పష్టత రానుంది.