ప్రాంతీయ వాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన బీఆర్ఎస్..అధికారంలోకి వచ్చాక ఆ వాదాన్ని పక్కనపెట్టేసింది. తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ వాళ్లేనని సెటిలర్లను సైతం ఆకర్షించింది. అదే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది. దాదాపు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ ను తిరస్కరించినా గ్రేటర్ లో సెటిలర్ల పుణ్యమా అని భారీ సీట్లు కైవసం చేసుకొని ఓ మాదిరి సీట్లు సాధించింది. కానీ, గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి కొని తెచ్చుకుంది.
ఎమ్మెల్యే అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన పొలిటికల్ వార్ లోకి కౌశిక్ రెడ్డి ఆంధ్రా వాదాన్ని తీసుకురావడమే ఇందుకు కారణం. ఎక్కడ నుంచో అరికపూడి గాంధీ తెలంగాణకు బతకడానికి వచ్చి, తెలంగాణ వారి మీదనే దాడి చేస్తారా అని భారీ డైలాగులే పేల్చారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేశారు..అప్పుడు గుర్తుకురాని ప్రాంతీయ వాదం ఆయన బీఆర్ఎస్ కు దూరమయ్యే సరికి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోంది. హైదరాబాద్ లో ఆంధ్రులు మాత్రమే కాదు..వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలూ ఉంటున్నారు. అయినా ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి ఆంధ్రులను అవమానించేలా కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది ఆంధ్రలేనని..కౌశిక్ రెడ్డి నోటి దూలతో వారూ బీఆర్ఎస్ కు దూరం అయ్యే పరిస్థితి తెచ్చారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీలకు తిరుగులేని అస్త్రాలుగా మారనుండటంతోపాటు ,బీఆర్ఎస్ గ్రేటర్ లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.