రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. కానీ, మంత్రి మండలి ఏర్పాటు దగ్గరకు వచ్చేసరికి… చాలా తాత్సారం చేశారు. మొత్తం 18 మందితో కేబినెట్ కూర్పుకి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల తరువాత కూడా కేబినెట్ ఏర్పాటు పూర్తికాలేదు. గతవారమే కొంతమందికి పదవులు ఇచ్చారు. ఇంకా భర్తీ కావాల్సిన శాఖలు ఆరు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు పూర్తయితే తప్ప ఈ శాఖల్ని ఎవ్వరికీ ఇచ్చే ఉద్దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేరనేది అర్థమౌతూనే ఉంది. అయితే, ఈ ఆరు బెర్తుల్లో అవకాశాల కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య దాదాపు 25 మంది వరకూ ఉంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే… ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉండబోతున్నారన్నట్టుగా కేసీఆర్ సంకేతాలు ఇచ్చేశారు.
అంటే, మిగిలినవి నాలుగే అన్నమాట! మరి, ఆ నాలుగింటిలో కేసీఆర్, హరీష్ రావుల సంగతేంటి? సామాజిక వర్గాల వారీగా ఎంతమందికి ప్రాధాన్యత ఇవ్వగలరు..? కేవలం మంత్రి పదవులు ఆశించే తెరాసలోకి వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డిలాంటి నాయకుల పరిస్థితి ఏంటి..? తెలంగాణలో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా తెరాసలోకి ఆకర్షిస్తున్నారు. సండ్రకు మంత్రి పదవి ఇస్తారనే భరోసా ఇచ్చారనీ ప్రచారం జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాల్లో పదవులు ఎలా ఇస్తారు..? ఇలా విశ్లేషించుకుంటూ పోతే…లోక్ సభ ఎన్నికల తరువాత తెరాస మంత్రి వర్గ విస్తరణ చాలా అసంతృప్తులకు ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆశావహులు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కేబినెట్ విస్తరణ ఆలస్యంపై గుర్రుగా ఉన్న పరిస్థితి.
లోక్ సభ ఎన్నికలతో లింక్ పెట్టుకోకుండా… అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర మంత్రి మండలిని నియమించేసి ఉంటే.. ఇంత తలనొప్పి పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. జాతీయ రాజకీయాల ఆశలకు రాష్ట్ర కేబినెట్ ను ముడిపెట్టుకుని కూర్చోవడం వల్లే ఈ సమస్య. మంత్రివర్గ విస్తరణ అంశం రాబోయే రోజుల్లో కచ్చితంగా ఒక సమస్యగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశావహుల్లో అసంతృప్తికి ఇది కారణం అవుతుందని చెప్పొచ్చు. ఆ అసంతృప్తి ఇప్పుడు బయటకి కనిపించదు! ఎందుకంటే, ఇంకా విస్తరణ పూర్తి కాలేదు కాబట్టి, తమకు అవకాశం వస్తుందేమో ఆశతో అందరూ ఉంటారు కదా! ఒకసారి మంత్రి వర్గ కూర్పు పూర్తయ్యాక… పరిస్థితి ఇప్పటిలానే ఉంటుందనే గ్యారంటీ ఉండదు. తన మాటకు తిరుగు లేదని కేసీఆర్ అనుకుంటున్నారుగానీ… కేబినెట్ కూర్పు తరువాత అప్పటి పరిస్థితి కొత్త సమస్యగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.