టీడీపీ కార్యకర్తలతో ఆదివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కార్యకర్తలు ఎలాంటి వ్యూహంతో పనిచెయ్యాలనే అంశాన్ని వివరించారు. ఒక్కో కార్యకర్త ఒక్కో కమాండర్ గా పనిచెయ్యాలన్నారు. కాపులకు న్యాయం చేస్తానంటూ ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నారనీ, కాపుల రిజర్వేషన్లు తన పరిధిలో లేదని గతంలో చెప్పి, ఇప్పుడు కొత్తగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. జగన్ ద్వారా ఆంధ్రాను దోచుకోవడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక ఇంటిని అద్దెకు ఇచ్చేముందు చాలా ఆలోచిస్తామనీ, బిడ్డను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఇంకా చాలా ఆలోచిస్తామనీ, అలాంటప్పుడు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటేసేముందు ఎన్ని ఆలోచించాలన్నారు.
31 కేసులతో అఫిడవిట్ దాఖలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలో ఎవ్వరూ ఉండన్నారు. అలాంటి నాయకుడి ఓటేసే ముందు ఒకటికి పదిసార్లు ప్రజలు ఆలోచించాలన్నారు. టీడీపీకి రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోందనీ, ప్రచార సభలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు చంద్రబాబు. టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉందనీ, వైకాపాను ఒక ఆట ఆడుకోవాలని కార్యకర్తలను చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే పదిరోజులూ సైనికుల్లా కార్యకర్తలు పనిచెయ్యాలనీ, ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రతీ ఇంటికీ వెళ్లి వివరించాలనీ, ఒక్కో కార్యకర్తా కనీసం పది ఓట్లు వేయించాలన్నారు.
చంద్రబాబు సభకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్న సంగతి వాస్తవమే. పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే, ఈ వ్యాఖ్యల వల్ల కార్యకర్తల్లో ధీమా వచ్చే అవకాశం ఉందనీ, ప్రచార జోరు పెంచాల్సిన సమయంలో కొంత రిలాక్స్ అయ్యేట్టుగా ఈ వ్యాఖ్యలు ప్రభావం ఉంటుందేమో అనేది కొందరి అభిప్రాయం. ఆత్మవిశ్వాసం నింపడం కోసమే ఈ వ్యాఖ్యలు చేసినా… అతివిశ్వాసం పెంచేవిగా వీటి ప్రభావం ఉంటుందేమో అనేది టీడీపీలో కొంతమంది అభిప్రాయం. ఓవరాల్ గా, టెలీ కాన్ఫరెన్స్ లో కూడా జగన్, కేసీఆర్ ల తీవ్ర విమర్శలు చేస్తూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.