వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక… అన్నా , చెల్లెళ్లు..అమ్మతో కలిసి సోనియాపైన… కాంగ్రెస్ పైన చేసిన కుట్రలు, కుతంత్రాలు, ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి అన్నీ మర్చిపోయి షర్మిలను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఇక్కడ షర్మిల ఎంత బలంగా నిలబడతారన్నదానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అది రాజకీయంగా పెద్ద బ్లండర్ అని.. కనీస ఆలోచన ఉన్న వాళ్లు ఎవరూ అలాంటి పని చేయరని అప్పట్లోనే చెప్పుకున్నారు. కానీ షర్మిల పార్టీ పెట్టారు. పాదయాత్ర చేశారు. తాను సీఎం అవుతానని చాలెంజ్ లు చేశారు. చివరికి పోటీ చేసే పరిస్థితి కూడా లేదని తెలుసుకుని వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఆఫర్ ఇవ్వడంతో అంగీకరించారు. అయితే తెలంగాణలో రాజకీయం చేస్తే ఎవరూ అభ్యంతర పెట్టలేదు..కానీ ఏపీలో కాంగ్రెస్ ను బలపరుస్తానంటే మాత్రం…అనేక ఒత్తిళ్లు వస్తాయి.
కాంగ్రెస్ బలపడితే.. దెబ్బతినేది జగన్ రెడ్డేనని అందరికీ తెలుసు.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి రూ రాష్ట్ర విభజన అని కారణం చెబుతారు. కానీ కాస్త రాజకీయంగా ఆలోచిస్తే.. రాష్ట్ర విభజన కన్నా అసలు కారణం… వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా సొంత పార్టీ పెట్టుకోవడంతో నాయకుడు లేకుండా పోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ అంతా…వైసీపీ పక్కన చేరిపోయారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది కూడా. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టింది మాత్రం వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడమే.
కాంగ్రెస్ కు నాయకత్వం లేకపోవడం వల్ల లీడర్, క్యాడర్ అంతా జగన్ వెంట వెళ్లారు. ఇప్పుడు షర్మిల ఆ లోటు తీరుస్తారని అనుకుంటున్నారు. కానీ తమకు నష్టం జరిగితే… జగన్ ఆమెను పోటీ నుంచి తప్పించడానికి చేయని ప్రయత్నాలు ఉండవు.. ఆమె ఏ కారణంతో విబేధించారో అన్ని షరతులు ఒప్పుకుని అయినా పోటీ నుంచి విరమింపచేయాలనుకుంటే. కాంగ్రెస్ ను మళ్లీ చావుదెబ్బకొట్టాలనుకుంటారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించి… కాంగ్రెస్ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని షర్మిల నిలబెట్టుకోవాల్సి ఉంది.