సొంత పార్టీని దారుణంగా కించ పరుస్తున్న ఎంపీ కోమటిరెడ్డిపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా నోటీసులతో సరి పెడుతుందా అన్నదానిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన పార్టీలో ఉండి స్వయం వినాశనానికి పాల్పడుతున్నారని… పార్టీని వీలైనంతగా భ్రష్టు పట్టించడానికే పని చేస్తున్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు లెక్క లేనన్ని ఫిర్యాదులున్నాయి. రేవంత్ రెడ్డికి మద్దతుదారుగా ఉన్నారని షబ్బీర్ అలీపై లేనిపోని అభాండాలు వేసి హైకమాండ్‌కు లేఖ రాసి.. దాన్ని మీడియాలో ప్రచారం చేసినప్పుడే ఆయన నైజం తెలిసిపోయిందని చెబుతున్నారు.
అయితే కోమటిరెడ్డి సిట్టింగ్ ఎంపీ. ఆయనను కోల్పోతే ఓ ఎంపీని కోల్పోయినట్లు అవుతుంది. ఈ కారణంగానే హైకమాండ్ ఎదురు చూస్తూ ఉంది. కానీ కోమటిరెడ్డి దాన్నే అలుసుగా చేసుకుని మరింతగా చెలరేగిపోతున్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే లా లేరని.. కేవలం గెంటి వేయించుకునేందుకే ఇలా చేస్తున్నారని కొంత మంది వాదిస్తున్నారు. ఓపిక పడితే ఆయనే వెళ్లిపోతారని కూడా చెబుతున్నారు. కానీ పార్టీలో ఉండి ఆయన చేస్తున్న వ్యవహారాలను ఇంకా భరిస్తే.. అది హైకమాండ్ చేతకాని తనానికి సాక్ష్యం అవుతుందన్న ఉద్దేశంతో చర్యలకు సిద్ధమయ్యారు.
పది రోజుల సమయాన్ని కోమటిరెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది. ఆ సమయంలోపు ఆయన స్పందిస్తే… సరే లేకపోతే చర్యలు తీసుకోవచ్చు. అయితే కోమటిరెడ్డి .. దీన్ని కూడా కాంగ్రెస్ పై విపరీత ప్రచారం జరగడానికి వాడుకునే అవకాశం ఉంది. రాహుల్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల డైవర్షన్ జరుగుతుంది. కోమటిరెడ్డికి కూడా ఇదే కావాలి. అందుకే కోమటిరెడ్డి విషయంలో చర్యలు.. రాహుల్ గాంధీ తెలంగాణ పాదయాత్ర ముగియగానే తీసుకునే చాన్స్ ఉంది. అలా కూడా తీసుకోలేకపోతే.. కోమటిరెడ్డికి కాంగ్రెస్ మరింత అలుసైపోతుంది.