ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పోర్టల్‌ను ప్రారంభించి టిక్కెట్లను కేవలం తమ వెబ్ సైట్ నుంచి మాత్రమే అమ్మేలా చేసుకుని అదనపు ఆదాయం పొందాలని ప్రణాళికలు వేసుకుంది. దాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులుకూడా ఇచ్చింది. అయితే ఈ జీవోపై ఇప్పటికే అనేక సందేహాలు ప్రారంభమవుతున్నాయి. అసలు ప్రైవేటు వ్యాపారంపై పెత్తనం చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా..? అనేది అందులో మొదటిది. ఎందుకంటే సినిమా ఏ టూ జడ్ శ్రమ ఆ యూనిట్‌ది. సంపాదన కూడా ఆ యూనిట్‌దే. కష్టమైనా.. నష్టమైనా ఆ యూనిట్ భరిస్తుంది. చట్ట బద్ధంగా కట్టే పన్నులు కట్టేస్తూ ఉంటారు.
అంతా అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసే వాళ్లు టిక్కెట్లు కూడా తమ దగ్గరే కొనాలని ప్రభుత్వం ఎలా అంటుంది..? ఆ కలెక్షన్లు అన్నీ తమ దగ్గరే పెట్టుకుంటామని ఎలా అంటుంది..? ప్రైవేటు వ్యక్తుల సంపాదనను తాము తీసుకుంటామని జీవో ఇస్తే అది ఎలా చెల్లుబాటవుతుంది..? ఇవే సందేహాలు అందరికీ వస్తున్నాయి. పైగా పోర్టల్ నిర్వహించినందుకు కలెక్షన్లలో వాటాలు తీసుకుంటారు. ఇప్పటికి ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టళ్లు ఉన్నాయి. అవి టిక్కెట్ కొనే వారి వద్దనే వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అదే చేస్తుందా లేక నిర్మాతల సొమ్మే తీసుకుంటుందా అన్నదానిపైనా స్పష్టత లేదు. అయితే ఏ విధంగా చూసినా ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో జోక్యంచేసుకుని ఆదాయాన్ని మళ్లించుకుంటామంటే మన రాజ్యాంగం అంగీకరించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అందుకే ప్రభుత్వ నిర్ణయం కోర్టుల్లో నిలిచే అవకాశం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ప్రభుత్వం ఏదో ఉద్దేశంతో కావాలనే ఇలాంటి నిర్ణయాలతో జీవోలు విడుదల చేస్తోందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. అమలు సాధ్యం కాని ఇలాంటి నిర్ణయాలతో తాము ఎవరినో బ్లాక్ మెయిల్ చేయాలనో.. బెదిరించాలనో ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.