ఏ వ్యాపారం మొదలెట్టినా… ఆ రంగంలో లోటుపాట్లని సమర్థంగా అధ్యయనం చేసి, మరో యాభై ఏళ్లకు సరిపడా పునాదులు వేసుకోవడం రామోజీ రావు స్టైల్. ఆయన ఇప్పుడు ఓటీటీపై దృష్టి పెట్టారు ఈటీవీ విన్ పేరుతో ఓ ఓటీటీ సంస్థని ప్రారంభించారు. అయితే.. ఈటీవీ విన్ ప్రస్తుతానికి అంత యాక్టీవ్ గా లేదు. ఈ ఆప్ గురించి కూడా ఎవరికీ పెద్దగా తెలియడం లేదు. చేతిలో బలమైన మీడియా సంస్థ ఉన్నా, సరైన ప్రమోషన్ చేసుకోవడం లేదు.
అయితే తెర వెనుక మాత్రం చాలా తతంగం నడుస్తోంది. ఈటీవీ విన్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకొనేందుకు దాదాపుగా యాభై మంది దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చేశారు. సినిమా అయితే రూ.3 కోట్ల లోపు బడ్జెట్. వెబ్ సిరీస్ అయితే రూ.6 నుంచి రూ.7 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. చిత్రసీమలో కాస్తో కూస్తో పేరు, ఒకట్రెండు సినిమాలు చేసిన అనుభవం ఉండి, ఓ కథతో వెళ్తే చాలు… ఈటీవీ విన్ ఆఫర్ ఇచ్చేస్తోంది. ఒక్కో దర్శకుడికి రెండు మూడు సినిమాల ప్యాకేజీ కూడా అందిస్తోంది. రవిబాబు ఈటీవీ విన్ కోసం ఇప్పుడు 3 సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. యేడాదిలో దాదాపు 100 సినిమాలు చేతిలో ఉంచుకొని.. అప్పుడు ఈటీవీ విన్ ప్రమోషన్లు మొదలెట్టాలని యాజమాన్యం భావిస్తోంది. ఈటీవీ దగ్గర చాలా సినిమాలున్నాయి. అవి మరే ఓటీటీలోనూ, శాటిలైట్ ఛానల్ లోనూ అందుబాటులో లేని సినిమాలు. అవన్నీ ఈటీవీ విన్కి ఓ తరగని నిధిలాంటివి. సాధారణంగా ఆహా లాంటి ఓటీటీ సంస్థలు ప్రారంభంలో ఎక్కువగా డబ్బింగ్ కంటెంట్ పై ఆధారపడ్డాయి. ఈటీవీ విన్కి అది ఇష్టం లేదు. అందుకే ఒరిజినల్ కంటెంట్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. మరో రెండేళ్లలో… ఈటీవీ విన్ని అమేజాన్, హాట్ స్టార్ రేంజ్కి తీసుకెళ్లాలని రామోజీ అండ్ టీమ్ భావిస్తోంది. అదే జరిగితే.. ఆహా, జీ లాంటి సంస్థలకు ఈటీవీ నుంచి పోటీ మొదలయ్యే అవకాశం ఉంది.