ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఆంధ్రాకి మకాం మార్చనున్న సంగతి తెలిసిందే. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నా… ఇంకా హైదరాబాద్ లోనే పార్టీ కేంద్ర కార్యాలయం ఉండటంపై సొంత పార్టీ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. సార్వత్రికలు సమీపిస్తున్న తరుణమిది, సాధారణం కన్నా కనీసం ఓ ఆర్నెల్లు ముందు ఎన్నికలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పై పార్టీ నేతల ఒత్తిడి పెరిగింది. దీంతో త్వరలోనే హైదరాబాద్ నుంచి మకాం మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు దసరా పండుగ రోజున ముహూర్తం పెట్టుకున్నట్టు సమాచారం. ఆంధ్రాలో వైసీపీ కార్యాలయం నిర్మించే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. తాడేపల్లిలో ఓ రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీస్ నిర్మిస్తున్నారు. కావాల్సిన భూమిని పార్టీకి చెందిన జి. ఆదిశేషగిరిరావు ఇచ్చినట్టు చెబుతున్నారు.
జగన్ ఆంధ్రాకి నివాసం మార్చకపోవడంపై తెలుగుదేశం నేతలు కూడా గతంలో తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే అంశమై కొద్దిరోజులు కిందట జగన్ స్పందిస్తూ… ఆంధ్రాలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నాకనే వస్తానని ఓ బహిరంగ సభలో చెప్పారు. ఇప్పుడు ఆ నిర్ణయంలో చిన్న ఛేంజ్ ఏంటంటే… శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే వరకూ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు! ఇదే విషయమై ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో తనకు రెగ్యులర్ గా కేటాయిస్తున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను తాత్కాలిక నివాసంగా కేటాయించాలని జగన్ కోరారు. నిబంధనల ప్రకారం క్యాబినెట్ హోదా ఉన్న ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వం నివాసం కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
జగన్ లేఖపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన ఆలస్యం అయితే… ఆ ఇష్యూని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని, విమర్శలకు దిగే అవకాశం ఉంది. మరికొద్ది రోజులుపాటు ప్రభుత్వం స్పందన కోసం ఎదురుచూసి.. ఆ తరువాత, ఇదే అంశమై విమర్శలకు దిగేందుకు వైకాపా సిద్ధంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిత్రం ఏంటంటే… గడచిన మూడేళ్లలో ఏనాడూ ఇలాంటి ప్రయత్నం జగన్ చెయ్యలేదు. షెడ్యూల్ ప్రకారం మరో రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉన్నా… ముందే ఉంటాయనేట్టుగా ఈ మధ్య సీఎం సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ లో చురుకుదనం పుట్టినట్టుంది. ఇంకా హైదరాబాద్ లో కూర్చుంటూ ఏపీలో రాజకీయాలు చేయడం కుదరదని ఇన్నాళ్లకు తెలుసుకున్నట్టున్నారు.