వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జాతీయ రాజకీయాల విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఒక్క చానల్ దగ్గర ఒక్కో మాట చెబుతున్నారు. టైమ్స్ నౌ అనే చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మోడీ మళ్లీ ప్రధాని అయిపోతారని.. చెప్పుకొచ్చిన ఆయన… న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం.. కాంగ్రెస్ పట్ల సానుకూలంగా మాట్లాడారు. కాంగ్రెస్ పై కోపం లేదని చెప్పుకొచ్చారు. అన్నింటికీ దేవుడున్నాడని .. తాను రోజూ బైబిల్ చదువుతానని వైరాగ్యం ప్రదర్శించారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తనకు వ్యతిరేకత లేదని చెప్పడంలో పెద్ద వింతేమీ ఉండకపోవచ్చు. నేడు ఎన్నికల్లో ఎవరిని వ్యతిరేకించినా రేపు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతునివ్వడం, వారికా అవసరం లేకపోతే కనీసం మిత్రపక్షంగానైనా కొనసాగడం జగన్ కు అవసరం. 2014 ఎన్నికలకు ముందు, తర్వాత జగన్ అదే చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు… కానీ గెలిచిన వెంటనే మోడీతో దోస్తీ ప్రకటించారు.
కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకుండా సంకీర్ణ ప్రభుత్వం రావాలని జగన్ కోరుకుంటున్నాడు. కేంద్రంలో పాలకులతో వైరం పెట్టుకుంటే భవిష్యత్తు అంధకారమైపోతుంది. బెయిల్ రద్దయితే చాలు..రాజకీయజీవితంపై చీకట్లు అలముకుంటాయి. తన పరోక్షంలో పార్టీ నిర్వహణ కష్టమైపోతుంది. కాబట్టి కేంద్రంలో తన ఉనికిని చాటుకోతగిన స్థాయిలో లోక్ సభ సీట్లు సాధించడం జగన్ కు అత్యవసరం. అందుకే తనుపై కేసులు పెట్టించారని ఆరోపిస్తున్నా కాంగ్రెస్ పై ద్వేషాన్ని సైతం దిగమింగి ముందుకు నడవడానికే జగన్ నిర్ణయించుకున్నారు. జగన్ ఊహిస్తున్నట్టు మోడీయే మళ్ళీ అధికారానికొస్తే రాజకీయ జీవితం సాఫీగా నడిచిపోతుంది. ఒకవేళ అనుకోని రీతిలో కాంగ్రెస్ లేదా… కాంగ్రెస్ నేతృత్వంలోని మిత్రపక్ష కూటమి అధికారంలోకి వస్తేనే సమస్య వస్తుంది.
అందుకే.. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో.. సలహాలతో జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు.. జాతీయ మీడియా ముందు… తనకు వచ్చే ఎంపీ సీట్లతో.. ఎవరెవరి దగ్గరకు వెళ్లబోతున్నానో చెబుతున్నారు. ముందుగా తన ప్రయార్టీ బీజేపీ. కాంగ్రెస్ లేదా.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే… వెంటనే ప్రయారిటీ మారిపోతుంది. హోదా ఇస్తామన్నందుకు.. అప్పుడు ఆయన కృతజ్ఞతలు చెప్పి… తన తండ్రి ఆశయం .. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి.. అప్పుడు అవసరం లేకపోయినా… మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. కేసుల నుంచి… ఊరట పొందడానికి అంత కంటే.. గొప్ప దారి ఉండదు కదా..!