నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్యూర్ తెలంగాణ బిడ్డని… నువ్వు ఎక్కడి నుండో వచ్చి, మాకు మా గడ్డపై కూర్చొని సవాల్ విసిరితే బయపడతమనుకున్నవా? అంటూ ఎమ్మెల్యే అరికెపూడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో కేసీఆర్ ఆంధ్రా నాయకులను టార్గెట్ చేశారు. విమర్శలు చేశారు… కానీ ఎప్పుడూ దాడుల వరకు వెళ్లలేదు. తెలంగాణ వచ్చాక ఇప్పుడు మేం ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడున్న వారంతా మా బిడ్డలే అని ఆయనే ప్రకటించారు. 10 సంవత్సరాలు పరిపాలించారు. రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ గాలి వీచినా, గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ప్రజలంతా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. సెటిలర్స్ అంతా గులాబీ దండుకు, కేసీఆర్ కు ఓటేశారు. అరికెపూడి గాంధీ సహ నేతలంతా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి వచ్చారు.
ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారితే రాజకీయ పోరాటం చేయాల్సింది పోయి… తెలంగాణ బిడ్డను, బతకొచ్చినోడివి అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ రాజకీయంగా సెంటిమెంట్ ను వాడుకుంటుందని, కౌశిక్ రెడ్డి చేసిన లోకల్… నాన్ లోకల్ వ్యాఖ్యలు కేసీఆర్ సమర్థిస్తారా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
సమైక్యాంధ్ర నినాదం చేసి, జగన్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డికి మానుకోట రాళ్ల సమాధానం మర్చిపోయినట్లు ఉన్నారు… చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వచ్చి కొత్త బిచ్చగాడిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.