తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. మజ్లిస్ నేతృత్వంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు చర్చించిన తర్వాత యూసీసీ అనేది దేశాన్ని చీల్చడానికేనని స్పష్టం చేశారు. అయితే దీనిపై పత్రికా ప్రకటన మాత్రమే వచ్చింది. ఇప్పటికే కేసీఆర్.. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించారు. వాటికి పార్లమెంట్ లో వ్యతిరేకంగా ఓటేస్తారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రెండు వివాదాస్పదమైన బిల్లులకు ఆమోదం పొందాలని అనుకుంటోంది. అందులో ఒకటి ఢిల్లీలో ప్రభుత్వం కన్నా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలు కట్టబెట్టడం, దీనిపై ఆర్డినెన్స్ కూడా జారీ చేశా . ఈ రెండు బిల్లులనూ వ్యతిరేకిస్తున్న వారు కేసీఆర్ కు మిత్రులే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి బిల్లును వ్యతిరేకించాలని అడిగారు. కేసీఆర్ వ్యతిరేకిస్తామని ప్రకటించారు. యూనిఫాం సివిల్ కోడ్ అంశంలోనూ అంతే. వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. ఈ రెండింటినీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయినా వ్యతిరేకించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు కేసీఆర్.. తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్న బిల్లులకు ఎంపీలతో వ్యతిరేకంగా ఓటేయిస్తారా.. లేకపోతే ఓటింగ్ సమయంలో బాయ్ కాట్ చేయిస్తారా అన్నది కీలకం. వ్యతిరేకంగా ఓటేస్తే.. బీజేపీతో లాలూచీ ఏమీ లేదని.. ప్రజలకు గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. బాయ్ కాట్ చేస్తే మాత్రం రకరకాల చర్చలు జరుగుతాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు రాజ్యసభలో ఏడుగురు సభ్యులున్నారు. వారి ఓటింగ్ కీలకం అయ్యే అవకాశం ఉంది.