తెలంగాణలో ధాన్యాన్ని సేకరించి ఎఫ్సీఐకి ఇచ్చే విషయంలో భారీ స్కాం జరిగిందని బీజేపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. కానీ వారు విచారణ చేయించడం లేదు. ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి మరోసారి లేవనెత్తారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవక తవకలు జరుగుతున్నాయని.. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ వెంటనే విచారణ చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.
మార్చి నాలుగో వారంలో ఎఫ్సీఐ అధికారులు భౌతిక తనిఖీలు చేపట్టి గుట్టురట్టు చేసిన విషయం మీకు కూడా తెలుసుని… కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా నాలుగున్నర బస్తాల ధాన్యం భౌతికంగా లేకపోవడాన్ని ఎఫ్సీసీఐ అధికారులు గుర్తించారని.. దీని విలువ సుమారు రూ.45 కోట్ల మేరకు ఉంటుందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. దీనిని బట్టి బియ్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేయకుండా బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తేలిపోయిందంటున్నారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో 30 శాతం మేర అవకతవకలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. మీరు కూడా బియ్యం గాయబ్ అయ్యాయని చెబుతున్నారు. అంటే… రాష్ట్రంలో బియ్యం కుంభకోణం జరుగుతోందని కిషన్ రెడ్డికి తెలుసని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇలా గడచిన ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ నేతల అండదండలతో రైస్ మిల్లుల్లో రీ సైక్లింగ్ కుంభకోణం వేల కోట్లలోనే జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ స్థాయిలో జరిగి ఉంటుందో… ఎన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగి ఉంటుందో అంచనా వేసుకోవచ్చుని.. ఆధారాలు కనిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకునే అధికారం ఉండీ ఎందుకు మిన్నకుంటున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ తో రోజూ లడాయి పెట్టుకున్నట్టు ఫోజులు కొడుతున్న మీరు… టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యుల ప్రమేయంతో జరుగుతోన్న ఈ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించ లేకపోతున్నారు? రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతోన్న అవక తవకలు, బియ్యం రీ సైక్లింగ్ పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.