ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో… తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపి, ఉద్యమం విజయాన్ని ముద్దాడే వరకు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న ఆయన, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక క్రమంగా కనుమరుగయ్యారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యమ నేతగా కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్ధతు పలికారు. అంతకు ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటంతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోదండరాంను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా, అంతకు ముందు ప్రభుత్వం చేత నామినేట్ అయిన దాసోజు శ్రవణ్ కోర్టుకు వెళ్లటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయటంతో.. కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి విద్యాశాఖ సంబంధిత అంశాల్లో కోదండరాం చురుగ్గా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రాధాన్యత ఇస్తూ రావటంతో కోదండరాంకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇస్తారని, అందుకే ఆ శాఖను మంత్రివర్గ విస్తరణ వరకు సీఎం తన దగ్గరే పెట్టుకున్నారన్న చర్చ ఇటు కాంగ్రెస్ లోనూ సాగింది.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై చర్చ సాగుతున్న నేపథ్యంలో… కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం కూడా పూర్తైన నేపథ్యంలో… ఆయనకు మంత్రి పదవి దక్కుతుందన్న చర్చ జోరందుకుంది.