నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరి, నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలడం అనే దానికి ఉదాహరణ లక్ష్మీస్ ఎన్టీఆర్ నే. ఈ సినిమాకు ఇటీవల కాలంలో వచ్చినంత బజ్ మరి దేనికీ రాలేదు. సోషల్ నెట్ వర్క్ లో తెగ హడావుడి జరిగిపోయింది. సినిమా విడుదల కాకుండా ఎవ్వరాపగలరు అంటూ బీరాలు పలిగారు రామ్ గోపాల్ వర్మ. తనకే లీగల్ పాయింట్లు అన్నీ తెలుసు అన్నట్లు మాట్లాడారు. కానీ విడుదల తేదీ చూస్తుంటే ఒక్కో వారం వెనక్కు జరుగుతూ వస్తోంది.
ఇప్పటికి రెండు డేట్లు మారి మూడో డేట్ వచ్చింది. కానీ ఈ డేట్ కు కూడా సినిమా విడుదల అవుతుందా? అన్నది అనుమానంగా వుంది. ఇప్పటి వరకు సినిమా సెన్సారు కాలేదు. సోమ, మంగళవారాల్లో సెన్సారు కు వస్తుంది. ఎలాగూ కట్ లు చెప్పడం తప్పదు. అవసరం అయితే రివిజన్ కమిటీ ముందుకు వెళ్లకతప్పదు. అంటే వచ్చే శుక్రవారం నాటికి రెడీ అవ్వడం అన్నది కాస్త అనుమానమే.
బుధవారం నాటికి సెన్సారు జరిగితే తప్ప శుక్రవారం విడుదల కాదు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం అది సాధ్యం కాదనే తెలుస్తోంది. ఇక మిగిలింది ఫస్ట్ వీక్ ఫ్రైడే మాత్రమే. అది దాటిపోతే ఇక సినిమా ఎప్పుడు విడుదలయినా ఒకటే. 11న పోలింగ్ ముగిసిపోతే, ఇక ఈ సినిమా గురించి ఎవ్వరూ పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు.
ఇదిలా వుంటే అస్సలు సినిమాలో ఏముందో అన్నది ఎవ్వరికీ తెలియదని, అంతా వర్మ హంగామా, మాస్టర్ ప్లాన్ తప్ప మరేమీ కాదని, ఇప్పటికే తెరవెనుక వర్మతో జరగాల్సిన వ్యవహారాలు జరిగిపోయాయని ఇలా రకరకాల వదంతులు వినిపించడం ప్రారంభమైంది. దీంతో జనాల ఆసక్తి సన్నగిల్లిపోయింది. దాన్ని పైకి లేపాలని వర్మ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు.
ఇంకోపక్క సినిమాను కొంటామని ముందుకు వస్తున్నవాళ్లంతా సెన్సారు సర్టిఫికెట్ వస్తేనే అన్న కండిషన్ పెడుతున్నారు. మొత్తం మీద వ్యవహారం చూస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నికల అవతలకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది.