మూడు దశాబ్దాలుగా ఓ ఆకాంక్ష కోసం అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితమన్నారు.
సుప్రీం తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు ఆటంకాలు తొలగడంతో ఇక మందకృష్ణ ప్రయాణం ఏంటన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇన్నాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటాలు చేసిన మందకృష్ణ ఇక పొలిటికల్ పార్టీ ద్వారా ఆ సామాజిక వర్గం అభ్యున్నతికి పాటుపడుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన బీజేపీ ద్వారా ఆయన పొలిటికల్ ప్రయాణం కొనసాగనుందా అని చర్చ జరుగుతోంది.
Also Read : చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ – మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రకటించగానే మందకృష్ణ.. లోక్ సభ ఎన్నికల్లో ఎస్సీలంతా బీజేపీని బలపరచాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం కావడంతో మందకృష్ణ బీజేపీతో కలిసి సాగే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది.
బీజేపీ కూడా మందకృష్ణ సేవలను రాజకీయంగా వాడుకోవాలని భావిస్తూ ఉండొచ్చు. ఆయన పార్టీలో చేరితే ఆ సామాజిక వర్గం అంతా బీజేపీ వైపు టర్న్ అయ్యే అవకాశం లేకపోలేదు. పైగా దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో మరింత బలపడాలని అభిలాషిస్తోన్న బీజేపీ..మందకృష్ణకు రాజ్యసభను కూడా ఆఫర్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
సో, ఎలా చూసినా మందకృష్ణను బీజేపీలో చేరాలని ఆహ్వానించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. బీజేపీ ఆహ్వనంపై మందకృష్ణ ఎలా స్పందిస్తారు అన్నది మరో చర్చగా మారింది.