గత ప్రభుత్వం పక్కనపడేసిన నయీం కేసును రేవంత్ సర్కార్ రీ- ఇన్వెస్టిగేట్ చేయబోతుందా..? నయీం డైరీలోని అంశాల ఆధారంగా కేసును తిరిగి దర్యాప్తు చేసేందుకు అడుగులు పడనున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
2016లో జరిగిన నయీం ఎన్ కౌంటర్ , అనంతరం కొనసాగిన దర్యాప్తుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. నయీంకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..? కేసును దర్యాప్తు చేసి అప్పటి అధికారులు ఎంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు..? బీఆర్ఎస్ నేతలకు ఏమైనా ముట్టిందా..? అనే కోణంలో మరోసారి కేసును దర్యాప్తు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో నయీంకు లోపాయికారీ సంబంధాలు ఉన్నాయని, వందల కొద్ది భూములు వీరి హ్యండోవర్ లో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నయీం ఎన్ కౌంటర్ తర్వాత దర్యాప్తు బృందం విచారణలలో ఈ విషయాలు అన్ని బయటకు వస్తాయని , రాజకీయ పరమైన ఒత్తిళ్ళతోనే ఇన్వెస్టిగేషన్ ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శలు ఉన్నాయి.
నయీంకు సంబంధించిన కేసులో 800మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు.కోర్టుల్లో 18చార్జీషీట్లు దాఖలు అయ్యాయి. 100మందిని కస్టడీల్లోకి తీసుకొని పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. కొద్ది రోజుల్లో ఈ కేసులో ఎదో జరగబోతుందన్న ఆసక్తిని కల్గించి ఆ తర్వాత సీరియస్ నెస్ ను తగ్గించేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ నయీం కేసును మరోసారి రీ – ఇన్వెస్టిగేట్ చేయాలని సీఎం రేవంత్ కోరుతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నయీంతో సంబంధాలు ఉన్నాయని , ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలంటే మరోసారి దర్యాప్తు అవసరమని వంశీకృష్ణ చెప్పడంతో ఈ కేసులో కదలిక వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ మేరకు ఈ కేసును రేవంత్ సర్కార్ రీ – ఇన్వెస్టిగేట్ కు ఆదేశిస్తే కీలక విషయాలు వెలుగులోకి రావడం ఖాయం.