సీబీఐపై నమ్మకం ఉందా ..? లేదా..? చెప్పండి అంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ నుంచి ఈ అభిప్రాయసేకరణ జరుగుతోంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో సీబీఐ రావొద్దు అని జనరల్ కన్సెంట్ను రద్దు చేస్తున్నాయి. ఇలా రద్దు చేయడం వల్ల సీబీఐ విచారణలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అందుకే సీబీఐపై నమ్మకం ఉందా లేదా అని అభిప్రాయం అడుగుతోంది. సీబీఐపై నమ్మకం లేకనే వారు జనరల్ కన్సెంట్ను రద్దు చేశారని కేంద్రానికి తెలియకుండా ఉంటుందని అనుకోలేం కదా !
సీబీఐ పంజరంలో చిలకలా మారిపోయిందని న్యాయస్థానాలు ఎన్నో సార్లు అభిప్రాయం వ్యక్తం చేశాయి. గత ఏడేళ్ల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా దారి తప్పాయని ప్రజల్లో కూడా బలమైన అభిప్రాయం ఏర్పడింది. కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడటం.. బీజేపీ.. ప్రో బీజేపీ నేతలకు రక్షణ కల్పించడం మినహా ఆ దర్యాప్తు సంస్థలు చేస్తున్నదేమీ లేదన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్లుగానే కేసులు పెట్టడం.. కేసుల విచారణ జరగడం.. దాడులు .. సోదాలు జరగడం.. వంటివి కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని వందల మందిపై సీబీఐ కేసులు ..బీజేపీలో చేరగానికే కనిపించకుండా పోయాయి.
అలాగే బెంగాల్ వంటి చోట్ల సీబీఐ చేసి నహడావుడి కూడా కళ్ల ముందు ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ .. ప్రో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే సీబీఐ పై నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వారు మిత్రపక్షంగా వ్యవహరిస్తారు కాబట్టి. బీజేపీ ప్రత్యర్థులకు అసలు నమ్మకం ఉండే అవకాశమే లేదు. ఆ విషయం కేంద్రానికి కూడా తెలుసు. కానీ ఏదో అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటోంది.
నిజానికి సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ. కానీ రాజకీయం ఆ స్వాతంత్రాన్ని లాగేసుకుంది. వెన్నుముక లేని అధిపతుల్ని అక్కడ కూర్చోబెట్టి చిటికెనవేలితో ఆడించి.. మొత్తానికి భ్రష్టపట్టించింది. దీని వల్ల రాజకీయగాలాభం పొందారేమోకానీ.. దేశానికి తీవ్ర ద్రోహం చేశారని వారు గుర్తించలేకపోయారు. ఓ వ్యవస్థను ఒకరు దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తే.. తర్వాత వచ్చే వారు తాము బాధలు పడ్డాం కాబట్టి ప్రతీకారంగా అంత కంటే ఎక్కువగా దుర్వినియోగం చేస్తారు. ఆ పతనం అలా జరుగుతూనే ఉంటుంది. ఈ ద్రోహం ఖచ్చితంగా రాజకీయ పార్టీలదే.