మార్చి నుంచి మన కోసం ప్రశాంత్ కిషోర్ వస్తారు. మనం అందరం ప్రజల్లోకి వెళ్లాలి. ఇక ప్రజల్లోనే ఉండాలి అని గత ఏడాది జరిగిన ఓ కేబినెట్ భేటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. అయితే ఇప్పుడు మార్చి వచ్చేసింది. కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చారో లేదో స్పష్టత లేదు. తెలంగాణకు అయితే వచ్చారని ఫోటోలతో సహా సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన టీఆర్ఎస్ కోసం పని చేయబోతున్నట్లుగా స్పష్టమయింది. మరి జగన్ కోసం పని చేస్తారా లేదా అన్నదానిపైనే స్పష్టత లేదు.
గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించి పెట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సైలెంటయ్యారు.ఆయన అధికారికంగా వైసీపీకి పని చేయడం లేదు.కానీ ఆయన టీమ్‌లో పని చేసిన చాలా మంది ఏపీ ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్లలో చేరారు. వారే సోషల్ మీడియా క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. కానీ పీకే నేరుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ఉండే ఎఫెక్ట్ వేరు. అయన కేసేఆర్ కోసం పని చేయడానికి సిద్ధమయ్యారు కానీ.. జగన్ కోసం పని చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.
జగన్‌తో పీకేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీకే టీంలో సభ్యుల పెళ్లికి కూడా ఆయన కుటుంబసమేతంగా లక్నో లాంటి ప్రాంతాలకు వెళ్లివచ్చారు. అయితే పీకే ఎవరికి పని చేస్తారాన్నదానిపై కొన్ని లెక్కలు వేసుకుంటారు. పోటాపోటీగా ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేస్తారు. షర్మిలకు పని చేయడానికి సిద్ధమైనా… కనీస ప్రభావం చూపలేమని అర్థమైపోయి వెనక్కి తగ్గారు. పైగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన పీకే.. ఇక ఏ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా పని చేయనని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారు. జగన్ విషయంలో ఏం చేస్తారో చూడాలి !