ఏ సినిమా అయినా కనీసం 4 వారాల తరవాత ఓటీటీలోకి రావాలి అనే రూల్ ఉంది. అయితే ఈ నాలుగు వారాలు సరిపోవని, థియేటర్లు బతకాలంటే కనీసం 8 వారాలకు పొడిగించాలన్నది ప్రధాన డిమాండ్. సినిమా హిట్ అయితే పర్వాలేదు. కానీ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏమిటి? ఫ్లాప్ సినిమాని కొన్న ఓటీటీ సంస్థలు 8 వారాల వరకూ ఆగుతాయా? ఆ ప్రశ్నే లేదు. సినిమా ఫ్లాప్ అయితే గనుక 4 వారాల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ ఓ తాజా ఉదాహరణ.
ఆగస్టు 15న వచ్చిన సినిమా ఇది. థియేటర్లలో ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మూడు వారాలు తిరిగే లోపే ఓటీటీలో ప్రత్యక్షమైపోయింది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూడొచ్చు. ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాల్లో అలీ ట్రాక్ ఒకటి. ఆ ట్రాక్ ప్రేక్షకుల్ని బాగా విసిగించింది. చివర్లో మేలుకొన్న పూర్తి… అలీ ట్రాక్ ని పూర్తిగా లేపేశారు. ఆ తరవాత కొత్త వెర్షన్ బయటకు వదిలారు. అయితే ఓటీటీలో మాత్రం అలీ ట్రాక్ అలానే ఉంది. ఓటీటీ వెర్షన్లో కూడా అలీ ట్రాక్ ని తీసేస్తే బాగుండేది. ప్రస్తుతానికైతే ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రెండింగ్ లోనే ఉంది. లాంగ్ రన్లో ఇలానే ఉంటుందా? లేదా? అనేది చూడాలి. ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షనే ఎక్కువగా చూస్తున్నార్ట జనాలు. రామ్ కు హిందీ నాట మంచి గుర్తింపే ఉంది. థియేటర్లకు వెళ్లి మరీ రామ్ సినిమాలు చూడరేమో గానీ, ఓటీటీలోకి వచ్చినప్పుడు మాత్రం బాగానే కవర్ చేస్తారు. ఆ ఇంపాక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌పై’ పడే అవకాశం ఉంది.