కృష్ణ వంశీ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. మరాఠీ సినిమా నటసామ్రాట్ కి అఫీషియల్ రీమేక్. ఇప్పటివరకూ బయటికి వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యులు కూడా జరిగాయి. ఈ సినిమా చూసిన వాళ్ళంతా కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ప్రతి ఒక్కరూ కన్నీళ్లు వచ్చేశాయి అంత మంచి ఎమోషన్స్ వున్నాయని చెబుతున్నారు.
కృష్ణ వంశీ సినిమా అంటేనే మార్క్. మేకింగ్ టేకింగ్ లో ఆయనకు తిరుగులేదు. రంగమార్తాండ విషయానికి వస్తే ఇళయరాజా మ్యూజిక్ వుంది. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ లాంటి నటులు వున్నారు. బ్రహ్మనందాన్ని సరికొత్తగా చూపించారని అంటున్నారు. మంచి సందేశం, కన్నీళ్ళు, గుండెతడి, ఆర్ద్రత, మనసుని కదిలించే ఇలాంటి పోలికలతో సినిమాని మెచ్చుకుంటున్నారు ప్రివ్యూ ఆడియన్స్. అయితే ఇలాంటి ఎమోషన్స్ వున్న సినిమాలు అవార్డు కేటగిరీలో చేరడం సులభమే కానీ.. బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించడం బాగా అరుదు.
పైగా ఇపుడు థియేటర్ ఆడియన్స్ లో చాలా మార్పులు వచ్చాయి. ఖచ్చితంగా థియేటర్లో చూడాలనే ఫీలింగ్ కలిగే సినిమాకే టికెట్లు తెగుతున్నాయి. ఆ క్యురియాసిటీ కలిగించలేకపొతే ఓటీటీలో చూసుకుందామని రిలాక్స్ అయిపోతున్నారు. ఇలాంటి నేపధ్యంలో ఫీల్ గుడ్ టాక్ తో వస్తున్న రంగమార్తాండ బాక్సాఫీసు ఫలితం ఎలా వుంటుందో చూడాలి.