వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న బెంగళూరు అనూహ్యంగా పుంజుకొన్న తీరు… ఈ ఐపీఎల్ కే హైలెట్. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి, ఈరోజు ఛాంపియన్ జట్టుగా అవతరించే స్థాయికి చేరుకొంది. ప్లే ఆఫ్ వరకూ బెంగళూరు సాగించిన ప్రయాణం… ఓ చరిత్ర. ఇప్పుడు ప్లే ఆఫ్ 2లో ఎలా ఆడుతుందన్నది ముందున్న ప్రశ్న. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు తన ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా ఆరు గెలుపులతో జోరుమీద ఉన్న బెంగళూరు రాజస్థాన్ని ఓడించడం అంత తేలికేం కాదు. అలాగని కష్టసాధ్యమైన విషయం కూడా కాదు.
కోహ్లీ, డూప్లెసెస్, రజత్ పడిదార్, దినేష్ కార్తీక్… ఇలా బెంగళూరు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మాక్స్వెల్ కూడా రెచ్చిపోతే… బెంగళూరు జోరుకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. గ్రీన్ లాంటి ఆల్ రౌండర్ ఉండడం బెంగళూరుకు వరం. చివరి ఆరు మ్యాచ్‌లలో బెంగళూరు గెలవడానికి కారణం వాళ్ల పటిష్టమైన బౌలింగ్ విభాగం. తొలి మ్యాచ్‌లలో తేలిపోయిన బౌలర్లు క్రమంగా నిలదొక్కుకొన్నారు. సిరాజ్ ఈ బౌలింగ్ దళానికి నాయకుడిగా మారాడు. యష్ దయాళ్ కీలకమైన సమయాల్లో రాణిస్తున్నాడు. కరణ్ శర్మ మధ్య ఓవర్లలో కట్టడి చేస్తూ, వికెట్లు దండుకొంటున్నాడు. పార్ట్ టైమర్ మాక్స్వెల్ కూడా వికెట్లు తీయగల సమర్థుడే. వీళ్లంతా కలసి కట్టుగా రాణిస్తే రాజస్థాన్ ని దాటడం కష్టమేం కాదు.
రాజస్థాన్ కథ మరోలా ఉంది. తొలి 9 మ్యాచ్‌లలో 8 గెలిచి, జోరు చూపించిన రాజస్థాన్ చివరి 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయితే లీగ్ దశలో బెంగళూరుని ఓడించిన రికార్డ్ ఉంది. కీలకమైన తరుణంలో బట్లర్ లేకపోవడం రాజస్థాన్‌కు లోటే. అయితే సంజూ శాంసన్, జైస్వాల్, పరాగ్, హిట్మయర్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అశ్విన్, చాహల్, బౌల్ట్ తో కూడిన బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా తయారైంది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ సమతూకంలో ఉన్న జట్టు రాజస్థాన్. వాళ్ల ఆల్ రౌండర్ ప్రతిభ మరోసారి మెరిస్తే.. బెంగళూరుకు కష్టమే. హైదరాబాద్ – కొలకొత్తా మధ్య జరిగిన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. అయితే ప్లే ఆఫ్ 2 మాత్రం రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం చెలాయించేదెవరో చూడాలి.