అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు సర్కారు తాజాగా రైతులకు సాయం ప్రకటించింది. ఈ పథకంపై ‘అన్నదాతకు మళ్లీ టోకరా’ అంటూ సాక్షి పత్రిక ఒక కథనం వండి వార్చేసింది. ఎకరాకి రూ. 10 వేలు ఇస్తామని ఎల్లో మీడియాతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకుని, చివరికి ఆరు వేలు కోత పెట్టి రూ. 4 వేలు మాత్రమే సాయం ప్రకటించారని విమర్శించింది. కేంద్రం రైతులకు ఇస్తున్న సాయాన్ని కూడా కలిపేసుకుని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకోబోతున్నారనీ, ఇది రైతుల్ని నిలువునా మోసం చేసినట్టే అంటూ ఓ కథనంలో పేర్కొన్నారు.
కేంద్రం ప్రకటించింది రైతుకు రూ. 6 వేలు సాయం. అయితే, ఐదు ఎకరాలకు పైన భూమి ఉన్న రైతులకు కేంద్ర పథకం వర్తించదు. అలాంటి రైతు కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇక, కేంద్రం పథకం ప్రకారం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల సంఖ్య దాదాపు 54 లక్షల మంది ఉంటారు. వారికి కేంద్రం ఇస్తున్న రూ. 6 వేల సాయం పెద్దగా దేనికీ ఉపయోగపడదు. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేలు వారికి అదనంగా ఇస్తోంది. అయితే, సాక్షి చెప్పినట్టు ఈ రైతులకు రూ. 10 వేలు మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఇంకోటి… కేంద్రం నిబంధనల ప్రకారం ఈ పథకానికి అనర్హులని ప్రకటించిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ. 10 వేలు ఇస్తోంది. అంటే, ఐదెకరాలలోపు ఉన్నవారితో సమానంగా, ఐదెకరాలు దాటి భూమి ఉన్న రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సాయం చేస్తోంది. ఇంకోటి… కౌలురైతులకు కూడా ఏపీ సర్కారు సాయం చేస్తుండటం ఇక్కడ గమనార్హం.
దీన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా… కేంద్రం నిధులు రూ. 6 వేలు కలిపి, ఏకంగా రూ. 10 వేలు మేమే ఇచ్చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని సాక్షి విమర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు రాష్ట్రం కొంత జోడించి ఇవ్వడాన్ని ఏదో పెద్ద తప్పు అన్నట్టుగా, అపచారం అన్నట్టుగా సాక్షి రాసింది. ప్రజాస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విడివిడిగా చూడటం వారికి అలవాటైపోయింది కాబట్టి… ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం ఇస్తున్నది సరిపోనప్పుడు, దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత అదనంగా కలిపి ఇవ్వడంలో తప్పేముంది..? ఇక్కడ అరకొర నిధులు ఇస్తున్న కేంద్రం తీరు సాక్షికి తప్పుగా కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టం తప్పుగానో వంచనగానో సాక్షికి కనిపిస్తోంది. ఇక్కడ కూడా కేంద్రాన్ని వెనకేసుకొచ్చే విధంగా సాక్షి వ్యవహరించడం మరీ దారుణం! రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు మాత్రమే తప్పుగా కనిపిస్తాయి, కేంద్రం వ్యవహరిస్తున్న తీరులో వారికి లోపాలు కనిపించవు.