అధికారంలోకి రావడానికి అధికార పార్టీపై పోరాడకుడా తమలో తాము పోరాడుకుంటున్న టీ కాంగ్రెస్ నేతలకు .. కొత్త ఇంచార్జ్ ధాక్రే ఓ ఫార్ములా సెట్ చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయవద్దని సీనియర్ల ప్రధాన డిమాండ్ గా ఉంది. తాము కూడా చేస్తామని అంటున్నారు. దీంతో థాక్రే… రేవంత్ రెడ్డికి యాభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసే చాన్సిచ్చారు. మిగతా సీనియర్లు ఇరవై నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకోవచ్చని చాయిస్ ఇచ్చారు. ఏదో ఓ ఫార్ములాకు కట్టుబడక తప్పదు కాబట్టి.. తమకూ పాదయాత్రకు అనుమతి వచ్చింది కాబట్టి సీనియర్లు కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కొత్త కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదని అలాంటి ఆలోచన పక్కన పెట్టాలని మాణిక్ రావు థాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి మరింత ధైర్యం వచ్చినట్లయింది. ఆయన కొత్త డీసీసీ అధ్యక్షుల్ని నియమించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీ లు బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు. కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని.. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని రేవంత్ హెచ్చరించారు.
ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జరుగుతంది.. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరాటమే కానీ.. ఎవరికీ సొంత నియోజకవర్గంలో కూడా జన సమీకరణ చేసుకునేంత క్రేజ్ లేదు. రేవంత్ రెడ్డి కి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అయినా రేవంత్ వెనుక నడవకుండా.. తాము సీనియర్లమని.. తమను పట్టించుకోవడం లేదని.. వారు పార్టీని ఆగం పట్టించుకున్నారు. వచ్చిన ఇంచార్జులందర్నీ తరిమేశారు. ఈ ఫార్ములాకైనా కట్టుబడి ఉంటారా.. తర్వాత మామూలేనా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.