ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఉందా షర్మిల వ్యాఖ్యానించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మకమవుతోంది. దీనికి కారణం అన్న జగన్తో తేల్చుకోలేనంత విభేదాలు రావడమే. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో జరిగిన కుటుంబ సమావేశాలో అన్నతో తీవ్ర వాగ్వాదానికి దిగి ఆమె పండుగ చేసుకోకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆమె ఎపీలో రాజకీయాలపై దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్న అంశంపై ముందుగానే సమాచారం ఇస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా అన్నను దారిలోకి తెచ్చుకోవాలంటే ఏపీలో పార్టీ ఏర్పాటు చేయాలనే సలహాలను తన మీడియా ద్వారా పంపుతున్నారు. ఈ క్రమంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఆసక్తి రేపుతున్నాయి.
షర్మిల త్వరలో ఏపీలో పర్యటనలు కూడా ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ విగ్రహాల ఆవిష్కరణకు ఆమెకు ఆహ్వానాలు వస్తున్నాయి. ఈ ఆహ్వానాలను మన్నిస్తే కొత్త మలుపులు ఖాయమే. అయితే తాను అన్ను కాదని జనంలోకి వెళ్తే వారి స్పందన ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికే షర్మిల పరిశీలన జరుపుతున్నారు. కొన్ని సంస్థలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. వైఎస్ కుమార్తెగా ఆమెకు జగన్తో పాటు మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ముందడుగు వేస్తారని చెబుతున్నారు.
వైసీపీలో సీఎం జగన్ తర్వాత ఎవరు అనే చర్చ రాకూడదు. కానీ ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసు వల్ల ఆ ప్రశ్నవస్తోంది. దానికి సమాధానం వెదుక్కునే క్రమంలోనే ఎన్నో విభేదాలు ఆ కుటుంబంలో చోటు చేసుకుటున్నాయి. జగన్ చాయిస్ గా భారతీరెడ్డిని ఖరారు చేయగా.. కుటుంబం మొత్తం మాత్రం విజయలక్ష్మిని తెర ముందుకు తెస్తున్నారు. ఈ క్రమంలో గొడవలు పెరిగి పెద్దవైపోయాయి. అవి షర్మిల రాజకీయ పార్టీ పెట్టే దిశగా వెళ్తున్నాయి. ఈ గొడవల్ని జగన్ వ్యూహాత్మకంగా నిలుపుదల చేసుకుని.. రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటారా లేక … అదే మొండిపట్టుదలతో వ్యవహరించి ఇబ్బంది పడతారా అన్నది ఇప్పుడు వైసీపీలోనూ వెలుగు చూస్తున్న ప్రశ్న.