బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయినా…. శ్రీకాంత్ అడ్డాలపై ఎంతో కొంత పాజిటీవ్ ఒపీనియన్ ఉండేది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో లాంటి సినిమాలు చూసి… తనని నిందించడానికి మనసులు రాలేదు. ముకుంద ఫ్లాప్ అయినా, కొన్ని చోట్ల శ్రీకాంత్ అడ్డాల `వావ్` అనిపిస్తాడు. అయితే… `పెద కాపు`లో ఏ కొశానా.. ఆ లక్షణాలు లేవు. ఓ కొత్త హీరో కోసం ఈ కథని ఎంచుకోవడం, దాన్ని రెండు భాగాలు చేయాలనుకోవడం, శ్రీకాంత్ తన మార్క్ దాటి మరీ బయటకు వచ్చేయడం.. ఇవన్నీ `పెదకాపు`ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ రిజల్ట్ చూశాక.. `పెదకాపు 2` వస్తుందనుకోవడం అత్యాసే. కనీసం శ్రీకాంత్ అడ్డాలకు మరో సినిమా వస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
శ్రీకాంత్ దగ్గర ‘అన్నాయ్’ అనే కథ ఉంది. అది బౌండెడ్ స్క్రిప్టు. ఇది కూడా మల్టీస్టారర్ కథే. ఓ అగ్ర హీరో, ఓ యువ హీరో చేయాల్సిన సినిమా ఇది. గీతా ఆర్ట్స్‌లో ఓకే చేశారు. అయితే… చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. శ్రీకాంత్‌పై అంత రిస్క్ చేయగలమా? లేదా? అనే విషయంలో గీతా ఆర్ట్స్ తర్జన భర్జనలు పడింది. ‘పెదకాపు’ రిజల్ట్ తో.. వాళ్లిక రిస్క్ తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. అటు పెదకాపు 2 పోయింది, ఇటు అన్నాయ్ పోయింది. ఇప్పుడు శ్రీకాంత్ ముందున్న మార్గం దిల్ రాజు ఒక్కడే. దిల్ రాజుతో శ్రీకాంత్‌కి మంచి రాపో ఉంది. ఆ బ్యానర్లో రెండు సినిమాలు చేశాడు శ్రీకాంత్ అడ్డాల. రెండూ హిట్లే. శ్రీకాంత్ తో మరో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఆ ట్రంప్ కార్డు వాడే అవకాశం ఉంది. ఓ చిన్న కథతో.. దిల్ రాజు బ్యానర్లో సినిమా తీసి, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఒక్కటే సమస్య. చిన్నసైజు హీరోలు సైతం అందుబాటులో లేని పరిస్థితి. ‘కొత్త బంగారు లోకం’ టైపులో పూర్తిగా కొత్త హీరోలతో సినిమా చేస్తే తప్ప.. శ్రీకాంత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.